ఒకటో తేదీ నుంచి ‘ఓపెన్’ పరీక్షలు

30 Sep, 2016 03:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 1 నుంచి 14 వరకు ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఓపెన్ స్కూల్ సొసైటీ డెరైక్టర్ వెంకటేశ్వర శర్మ తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు గురువారం తెలిపారు. 57 కేంద్రాల్లో నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యేందుకు 17,490 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. 67 కేంద్రాల్లో నిర్వహించే ఎస్సెస్సీ పరీక్షలకు 20,659 మంది హాజరు కానున్నట్లు తెలిపారు.

హాల్‌టికెట్లను telanganaopenschool.org వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఉదయం 8.30 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. మొదటి రోజు పరీక్షకు 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని, ఉదయం 9.35 గంటల తర్వాత, మధ్యాహ్నం పరీక్షకు 2.05 గంటల తర్వాత పరీక్ష హాల్లోకి అనుమతించబోమని వెల్లడించారు. రెండో రోజు నుంచి 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్ష రాసేందుకు రైటింగ్ ప్యాడ్, పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, స్కేల్ వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని చెప్పారు.

మరిన్ని వార్తలు