‘రోణంకి’పై విచారణకు ఆదేశించండి

27 Jun, 2017 00:51 IST|Sakshi
‘రోణంకి’పై విచారణకు ఆదేశించండి
- అతనికి కేటాయించిన ర్యాంకును చట్ట విరుద్ధంగా ప్రకటించండి  
హైకోర్టులో పిల్‌ 
 
సాక్షి, హైదరాబాద్‌: సివిల్‌ సర్వీసెస్‌–2016  పరీక్షలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన రోణంకి గోపాలకృష్ణకు మూడో ర్యాంక్‌ కేటాయించ డాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించి, అతను సమర్పించిన అంగవైకల్య ధ్రువీకరణపత్రంపై విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. సికింద్రాబాద్, ఈస్ట్‌ మారేడ్‌పల్లికి చెందిన న్యాయవాది ఎం.మురళీకృష్ణ ఈ వ్యాజాన్ని దాఖలు చేశారు. ఇందులో కేంద్ర సిబ్బంది శిక్షణ శాఖ కార్యదర్శి, యూపీఎస్‌ సీ జాయింట్‌ సెక్రటరీ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రోణంకి గోపాలకృష్ణను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది.  

సివిల్‌ –2016లో గోపాలకృష్ణకు జాతీయ స్థాయిలో మూడవ ర్యాంకు వచ్చిందని తెలిపారు. అయితే గోపాలకృష్ణ తప్పుడు ధ్రువీకరణ పత్రం సమర్పించి పరీక్షకు హాజరయ్యారని వివరించారు. ఓబీసీ అయిన గోపాలకృష్ణ ఆర్థోపెడికల్‌ విభాగంలో 45% మేర అంగవైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం సమర్పించా రన్నారు. ఓబీసీలకు ప్రిలిమినరీ పరీక్షలో అర్హత మార్కులు 110.66 అని, అయితే గోపాలకృష్ణ 91.34 మార్కులు మాత్రమే సాధించారన్నారు. వికలాంగ కోటా కింద అర్హతకు 75.34 మార్కులని, దీంతో అతను మెయిన్‌ పరీక్షకు అర్హత సాధించారని తెలిపారు. 
 
సమయంతోనూ లబ్ధి
మెయిన్స్‌లో సాధారణ అభ్యర్థులకు పరీక్షా సమయం 3 గంటలు కాగా, వికలాంగ అభ్యర్థులకు 4 గంటలని, దీని ద్వారా గోపాలకృష్ణ లబ్ధి పొందారని పిటిషనర్‌ పేర్కొన్నారు. వాస్తవానికి గోపాలకృష్ణకు పెద్ద వైకల్యమేదీ లేదని పిటిషనర్‌ వివరించారు. గోపాలకృష్ణ వైకల్యంపై పత్రికల్లో కథనాలు వచ్చాయన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ గోపాలకృష్ణ అంగవైకల్యంపై విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని, అతనికి ఐఏఎస్‌ సర్వీసు కేటాయించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలన్నారు.  
మరిన్ని వార్తలు