పోస్టులు 9,281.. దరఖాస్తులు 5.32 లక్షలు

5 Feb, 2016 08:13 IST|Sakshi
పోస్టులు 9,281.. దరఖాస్తులు 5.32 లక్షలు

కానిస్టేబుల్ పోస్టుల  దరఖాస్తులకు ముగిసిన గడువు
తప్పులు దొర్లిన వారికి ఈనెల 6 నుంచి 11 వరకు అవకాశం

సాక్షి, హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తులు పోటెత్తాయి. 9,281 పోస్టులకు గురువారం గడువు ముగిసేనాటికి 5.32 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. లక్షలాది మంది దరఖాస్తు చేస్తుండటంతో వెబ్‌సైట్‌లో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్‌రావు ప్రత్యేక శ్రద్ధ వహించారు. అభ్యర్థుల సందేహాలను తీర్చేందుకు హెల్ప్‌లైన్ నంబర్ కూడా ఏర్పాటు చేశారు. అయినా అభ్యర్థులు దరఖాస్తు పూర్తి చేయడంలో తప్పులు చేసింటే వాటిని సరిదిద్దుకునేందుకు బోర్డు మరో అవకాశం కల్పించింది. ఈనెల 6 నుంచి 11 వరకు తప్పులను సరిచేసుకోవచ్చని తెలిపింది.

దరఖాస్తులో సంతకం మరచిన అభ్యర్థులు రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెయిల్ ఐడీ support@tslprb.in కి విన్నపం చేస్తూ తాజాగా సంతకం చేసిన ఫొటోను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వెంటనే అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ నంబర్‌తోపాటు ఈ మెయిల్‌కూ సమాచారం అందుతుంది. పోలీస్ కానిస్టేబుళ్ల నియామకం కోసం గతంలో ఉన్న విధానాలను పూర్తిగా మార్చేశారు. ఎంపిక విధానంలో మొట్టమొదటగా ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఏప్రిల్ 3న ప్రిలిమినరీ పరీక్ష (200 మార్కులు)ను నిర్వహిస్తారు. ఇందులో జనరల్ అభ్యర్థులు 40 శాతం, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 30 శాతం అర్హత సాధించాల్సి ఉంటుంది.

ఉత్తీర్ణత సాధించిన వారికే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. పరుగు పందెం సందర్భంగా కానిస్టేబుల్ అభ్యర్థుల ప్రాణాలు కోల్పోతున్నందున 5 కి.మీ., 2.5 కి.మీ. పోటీని పక్కన పెట్టారు. పురుషుల విభాగంలో కేవలం 800 మీటర్లు, మహిళల విభాగంలో 100 మీటర్ల పరుగుకే పరిమితం చేశారు. అనంతరం అంతిమంగా మరో రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులోనూ ఇంటర్మీడియెట్ స్థాయికి సంబంధించి 200 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో లభించిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మరిన్ని వార్తలు