‘కూరలు’ కష్టమే!

17 Aug, 2015 00:06 IST|Sakshi
‘కూరలు’ కష్టమే!

నగర శివారు ప్రాంతాల్లో తగ్గిన కూరగాయల సాగు
ఇతర ప్రాంతాల దిగుమతులపైనే ఆధారం
రోజు రోజుకూ పడిపోతున్న సరఫరా... ఆకాశాన్నంటుతున్న ధరలు
ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టని సర్కారు

 
మహానగరంలో ఇక కూరగాయలు దొరకడం కష్టమే. అసలే నిత్యావసరాల ధరలు మండిపోతుండగా..మరోవైపు కూరగాయలు కూడా మార్కెట్లో దొరకని పరిస్థితి. వర్షాభావం, సాగు, తాగునీటి కటకట కారణంగా శివారు ప్రాంతాల్లో కూరగాయల సాగు గణనీయంగా పడిపోయింది. డిమాండ్‌కు తగిన సరఫరా లేక మార్కెట్లో ధరలు మండిపోతున్నాయి. ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాల్సిన సర్కారు మిన్నకుండిపోవడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. మరికొద్దిరోజులు పరిస్థితి ఇలాగే ఉంటే కూరగాయల ధరలు కూడా ఉల్లి దారిలోనే సాగే ప్రమాదం పొంచి ఉంది. - సాక్షి, సిటీబ్యూరో
 
మహా నగరానికి కూరగాయల సంక్షోభం పొంచి ఉంది. ఒకవైపు వర్షాభావం..మరోవైపు సాగు, తాగునీటికి కటకట కారణంగా నగర శివారు జిల్లాల్లో కూరగాయల సాగు దారుణంగా పడిపోయింది. దీంతో మార్కెట్లో కూరగాయలు లభించని పరిస్థితి ఏర్పడుతోంది. డిమాండ్ భారీగా ఉండగా..సరఫరా దయనీయంగా ఉంది. రంగారెడ్డి, మెదక్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కూరగాయల సాగు పదేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు  50 శాతం మేర పడిపోయింది. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవక తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నాయి.  ఇప్పటికే ఉల్లి కొరత తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. స్థానికంగా ఉల్లిసాగు లేకపోవడంతో మహారాష్ట్ర, కర్నాటక, ఏపీలోని కర్నూలు నుంచి వచ్చే దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. అలాగే టమాట, మిర్చి, దొండ, బెండ, కాకర, క్యాప్సికం, క్యారెట్, ఫ్రెంచ్ బీన్స్, అరటి, ములగ, నిమ్మకాయలు, అల్లం, వెల్లుల్లి తదితర కూరగాయలు అత్యధికంగా బెంగళూరు, మదనపల్లి, గుంటూరు, విజయవాడ, కర్నూలు ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నారు. ఆలుగడ్డలు మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్ నుంచి దిగుమతి అవుతున్నాయి. అవి కూడా నగర డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా కావట్లేదు. సాధారణంగా ఏటా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూరగాయల కొరతతో ధరలు పెరుగుతాయి. తాజాగా వాతావరణ అననుకూలత  కూడా దీనికి తోడయింది. ప్రస్తుతం నగర మార్కెట్లో ఏ రకం కూరగాయలను చూసినా  కేజీ రూ.20 నుంచి 50 మధ్యలో ధర పలుకుతున్నాయి. క్యారెట్, పచ్చిమిర్చి, చిక్కుడు, క్యాప్సికం వంటివి స్థానికంగా ఉత్పత్తి కాకపోవడంతో సీజన్‌లో కూడా వాటి ధరలు ఆకాశంలోనే ఉంటున్నాయి. ప్రభుత్వం సత్వరం స్పందించి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించకపోతే భవిష్యత్ భయానకంగా తయారవుతోందని మార్కెటింగ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 ‘మహా’ డిమాండ్
 గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు కోటి జనాభా ఉందని ఓ అంచనా. ప్రపంచ ఆహార సంస్థ (ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్-ఎఫ్‌ఏఓ) నియమావళి ప్రకారం ఒక్కో వ్యక్తికి రోజుకు 300 గ్రాములు కూరగాయలు వినియోగించాలి. ఇందులో 50 గ్రాములు ఆకు కూరలు మినహాయిస్తే ఒక్కో వ్యక్తికి రోజుకు 250 గ్రాముల కూరగాయలు వినియోగం తప్పనిసరి. ఈ ప్రకారం నగరంలోని కోటి జనాభాకు అన్నిరకాల కూరగాయలు సుమారు 2500 టన్నులు అవసరం అవుతాయని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అంచనా వే సింది. అయితే, ప్రసుతం అన్నిరకాల కూరగాయలు రోజుకు 1600 టన్నులు మాత్రమే సరఫరా అవుతున్నట్లు రికార్డులు సూచిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే నగరానికి దాదాపు 45 శాతం మేర కూరగాయల కొరత ఉన్నట్లు వెల్లడవుతోంది. ఈ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వ సత్వరం చర్యలు చేపట్టాల్సి ఉంది. ఇందులో భాగంగా ‘పాలీహౌస్ ఫార్మింగ్’ను ప్రోత్సహించడంతో పాటు రైతులకు తక్కువ కాలవ్యవధిలో ఉత్పత్తినిచ్చే విత్తనాలను సబ్సిడీ ధరపై అందించాలని వ్యవసాయరంగ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే  పట్టణ ప్రాంతాల్లో ఇంటి  ఆవరణలో, రూఫ్‌పైన కూరగాయల సాగు విధానాలను ప్రోత్సహించాలంటున్నారు. నగర శివారు ప్రాంతాల్లో రియల్ వెంచర్లకు అనుమతులిచ్చేటప్పుడే వ్యవసాయ భూముల విషయంలో ప్రభుత్వం జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు