నకిలీ విత్తన కంపెనీలను వదిలిపెట్టం: రేవంత్‌రెడ్డి

21 Dec, 2016 04:07 IST|Sakshi
నకిలీ విత్తన కంపెనీలను వదిలిపెట్టం: రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: నకిలీ విత్తనాలను సరఫరా చేసి రైతాంగాన్ని నిలువునా ముంచిన కంపెనీలను వదిలిపెట్టేది లేదని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. ఖరీఫ్‌ సీజన్‌లో మిర్చి, సోయాబీన్‌ పంటలు వేసిన రైతులు నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయారని, అందుకే నకిలీ విత్తన కంపెనీలపై ప్రజా ప్రయోజన వ్యాజ్యంను కోర్టులో దాఖలు చేసినట్టుగా మంగళవారం వెల్లడించారు. నకిలీ విత్తనాల కారణంగా రైతులు పడుతున్న ఇబ్బందులను విన్న కోర్టు, రైతుల నష్టానికి విత్తన కంపెనీలు బాధ్యత వహించాల్సిందేనని, నకిలీ విత్తనాలతో ప్రమేయమున్న విత్తన కంపెనీలను కేసులో చేర్చాలని హైకోర్టు సూచించినట్టుగా రేవంత్‌ చెప్పారు.

విత్తన కంపెనీలనూ ప్రతివాదులుగా చేయండి
రేవంత్‌రెడ్డికి హైకోర్టు స్పష్టీకరణ  
సాక్షి, హైదరాబాద్‌: నకిలీ విత్తనాల వల్ల కలిగిన నష్టాన్ని సదరు కంపెనీల నుంచి వసూలు చేసి రైతులకు అందచేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ దాఖలు చేసిన వ్యాజ్యంలో విత్తన కంపెనీలను కూడా ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్‌ రేవంత్‌రెడ్డికి ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యానికి సంబంధించి ఏదైనా ఉత్తర్వులు ఇవ్వాలంటే, విత్తన కంపెనీల వాదనలు వినడం తప్పనిసరని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇందుకు పిటిషనర్‌ తరఫు న్యాయవాది రచనారెడ్డి అంగీకరించడంతో తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. మంగళవారం ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, జస్టిస్‌ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.  

మరిన్ని వార్తలు