చంద్రబాబు నాకు గురువని ఎక్కడా చెప్పలేదు: రేవంత్‌

19 Nov, 2023 20:28 IST|Sakshi

ప్రభుత్వ వ్యతిరేకతపై రేవంత్ ఆశలు

గెలిస్తే ముఖ్యమంత్రి అవుతానని నమ్మకం

చంద్రబాబుతో విడదీయలేని బంధం

అవసరం మేరకు అటు ఇటుగా గేమ్ ప్లాన్

సాక్షి, హైదరాబాద్‌: ఏపీలో టీడీపీని ఓడించాలని పార్టీ ఆదేశిస్తే వెళ్లి ప్రచారం చేస్తానని తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. తమకు, టీడీపీకి చర్చలు జరగలేదని తెలిపారు. బాబును తాను కలవలేదని చెప్పారు. చంద్రబాబు తనకు గురువు అని ఎక్కడా చెప్పలేదన్నారు. రాజకీయాల్లో తనకు గురువు లేరని.. తనకు తానే గురువు, శిష్యుడని అన్నారు.

సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పాలనపై చర్చకు సిద్ధమని తెలిపారు. కేటీఆర్‌ లేదా హరీష్‌ రావు చర్చకు రావాలని ఛాలెంజ్‌ చేశారు. తుమ్మల కామెంట్స్‌తో కాంగ్రెస్‌కు సంబంధం లేదన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఏ పదవి ఇచ్చినా, ఇవ్వకపోయినా పర్వాలేదని తెలిపారు. తనకు ఉన్నతమైన పీసీసీ పదవి ఇచ్చారని పేర్కొన్నారు. 

సీఎంగా పార్టీ ఎవరిని నిర్ణయించినా కట్టుబడి ఉంటానని రేవంత్‌ చెప్పారు 6 గ్యారంటీలకు తాను, భట్టి విక్రమార్క గ్యారంటీ అని తెలిపారు. ఏఐసీసీ ఆమోదంతో 6 గ్యారంటీలను ప్రకటించామన్నారు. తనది మధ్యతరగతి మనస్తత్వమని.. ప్రజల తరపున కొట్లాడటానికి వచ్చినట్లు చెప్పారు. గత 20 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసమే పోరాడుతున్నానని చెప్పారు.
చదవండి: రంగంలోకి హైకమాండ్‌.. అసంతృప్తులంతా దారికి వచ్చారా?

కేసీఆర్‌ మమ్మల్ని నమ్మించి మోసం చేశారని ప్రజలు నమ్ముతున్నారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్‌ ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు. కేసీఆర్‌ను మార్చాలని ప్రజలు డిసైడ్‌ అయ్యారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ రావాలని ఆశిస్తున్నారు. 80 నుంచి 85 స్థానాల్లో కాంగ్రెస్‌ గెలవబోతుంది.  బీఆర్‌ఎస్‌కు 25 స్థానాలు మించి గెలవదు. బీజేపీ 4 నుంచి 6 స్థానాలు మించదు. కామారెడ్డిలో కేసీఆర్‌కు మూడోస్థానమే. దమ్ముంటే కేసీఆర్‌ కొడంగల్‌లో పోటీ చేయాలి. 

కేసీఆర్‌ ఓడిపోతే సీఎం కావాలనేది కేటీఆర్‌ కోరిక. కామారెడ్డిలో కేసీఆర్‌ ఓడిపోవాలని కేటీఆర్‌ కోరుకుంటున్నారు. అవినీతికి పాల్పడిన వారు జైలుకు వెళ్తారు. హిమాన్షు ఆస్తుల వివరాలను కేటీఆర్‌ ప్రకటించలేదు. పార్టీ ఆదేశాలతోనే రెండు చోట్ల పోటీ చేస్తున్నా. కేసీఆర్‌పై పోటీ చేయాలని పార్టీ ఆదేశించినప్పుడు సంతోషించా. తెలంగాణ ప్రజలు హంగ్‌ ఇవ్వరు. తెలంగాణ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారు. పక్క రాష్ట్రాలతో ఆరోగ్యకరమైన సంబంధాలే కోరుకుంటాం’ అని రేవంత్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు