బౌద్ధం స్వీకరించనున్న రోహిత్ తల్లి, సోదరుడు

13 Apr, 2016 18:08 IST|Sakshi
బౌద్ధం స్వీకరించనున్న రోహిత్ తల్లి, సోదరుడు

 హైదరాబాద్: యూనివర్సిటీలు కేంద్రంగా కొద్ది నెలలుగా సాగుతోన్న ఆందోళనల్లో భాగంగా రేపు కీలక పరిణామం చోటుచేసుకోనుంది. హిందూ మంతంలో దళితులపై కొనసాగుతున్న వివక్షను నిరసిస్తూ బౌద్ధాన్ని స్వీకరించిన బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ బాటలోనే రోహిత్ వేముల కుటుంబం కూడా పయనించనుంది. దళితుడు కావడం వల్లే తన కుమారుడు వివక్షకు గురయ్యాడని, విద్యాలయం నుంచి వెలివేశారని, తనకు న్యాయం చేయాలంటూ కొద్ది నెలలుగా ఆందోళన కొనసాగిస్తోన్న రోహిత్ వేముల తల్లి రాధిక హిందూ మతాన్ని వీడి బౌద్ధాన్ని స్వీకరించనున్నారు.

అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా గురువారం ముంబై మహానంగరంలో జరిగే కార్యక్రమంలో రోహిత్ తల్లి రాధికతోపాటు సోదరుడు రాజాకూడా బౌద్ధం స్వీకరిస్తారు. ఈ మేరకు వారిద్దరూ కొద్దిమంది స్నేహితులతో కలిసి బుధవారం హైదరాబాద్ నుంచి ముంబై పయనమయ్యారు. బౌద్ధ ధర్మం అసమానతలకు తావులేనిదిగా భావించడం వల్లే బాబాసాహెబ్ అంబేడ్కర్  ఆ మతాన్ని స్వీకరించాడని, అటువంటి సమాన త్వాన్ని కాంక్షించే తాము కూడా అంబేడ్కర్ చూపిన మార్గంలో పయనించేందుకు నిర్ణయించుకున్నట్లు వేముల రాజా మీడియాకు తెలిపారు.

రెండేళ్ల కిందట కేంద్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలలకే సంఘ్ పరివార్ 'ఘర్ వాపసీ' కార్యక్రమాన్ని ప్రారంభించడం, పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రులు, ఒక పార్టీకి చెందిన ఎంపీలు అనుచిత వ్యాఖ్యలు చేయడం, వాటిపై దేశవ్యాప్తంగా ఆందోళనలను చెలరేగటం విదితమే. ఆ తర్వాత గో మాంసం వివాదం, విద్యావ్యవస్థ కషాయీకరణ తదితర అంశాలపై దళిత, మైనారిటీ వర్గాలు ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టడం తెలిసిందే. ఈ క్రమంలోనే అంబేద్కర్ విద్యార్థి సంఘం సభ్యుడు, హెచ్ సీయూ స్కారల్ రోహిత్ వేముల సంఘంసంఘ్ అనుబంధ ఏబీవీపీ విద్యార్థి సంఘంతో గొడవపడి, ఆత్మహత్యకు పాల్పడటం, అనంతరం దళితులపై వివక్షను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు పుట్టుకురావటం చూశాం. రోహిత్ కుటుంబం బౌద్ధమత స్వీకారంతో వర్సిటీల్లోని వేలమంది అణగారిన విద్యార్థులు కూడా అదే బాటపట్టే అవకాశం లేకపోలేదు.

మరిన్ని వార్తలు