ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విదేశీ విద్యకు రూ.20 లక్షలు

29 May, 2016 04:08 IST|Sakshi

ఆర్థిక సాయాన్ని రెట్టింపు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

 సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అందజేస్తున్న ఆర్థిక సహాయాన్ని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ సంతకం కాగానే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి స్కాలర్‌షిప్స్ పథకం కింద ప్రస్తుతం ఈ సహాయాన్ని అందిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలతోపాటు మైనారిటీ విద్యార్థులకు కూడా వర్తింపజేస్తున్నారు. మైనారిటీలకు కూడా సాయాన్ని రూ.20 లక్షలకు పెంచుతారా లేదా అనే దానిపై స్పష్టత రాలేదు.

విదేశాల్లో ఉన్నతవిద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం ఇస్తున్న రూ.10 లక్షలు సరిపోకపోవడంతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో ఈ మొత్తాన్ని రూ.20 లక్షలకు పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం అమెరికా, ఇంగ్లండ్, సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడాలలో ఉన్నత విద్యను అభ్యసించే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు రూ.10 లక్షల మేర ఆర్థిక సహాయం అందుతోంది. 2016-17లో 300 మంది విద్యార్థులను పంపించేందుకు రూ.75 కోట్లు ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించింది. ఈ పథకం కింద ఎంత మంది విద్యార్థులు వచ్చినా ఆర్థికసాయం చేసేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రణాళికలను సిద్ధం చేసింది.

మరిన్ని వార్తలు