ఏపీలో ప్రసారాల నిలుపుదలపై ‘సాక్షి’ న్యాయపోరాటం

15 Jun, 2016 02:57 IST|Sakshi
ఏపీలో ప్రసారాల నిలుపుదలపై ‘సాక్షి’ న్యాయపోరాటం

- ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలను నియంత్రించండి
- సాక్షి టీవీ ప్రసారాలకు ఆటంకం కలిగించకుండా చూడండి
- ప్రసారాలు వచ్చేలా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలివ్వండి
- రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రసారాల నిలుపుదల
- రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనను అడ్డుకోండి
- హైకోర్టులో సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్రమూర్తి పిటిషన్
 
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో తమ టీవీ చానల్ ప్రసారాల నిలుపుదల విషయంలో సాక్షి టెలివిజన్ న్యాయపోరాటం చేపట్టింది. సాక్షి టీవీ ప్రసారాల విషయంలో ఎంఎస్‌వోలకు ఏ రకమైన ఆటంకాలు కలిగించకుండా ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలను నియంత్రించాలని కోరుతూ సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి, టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) చైర్మన్, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎంఎస్‌వోల ఫెడరేషన్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లోనూ సాక్షి టీవీ ప్రసారాలు ప్రజలకు అందుబాటులో ఉండేం దుకు చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్లను ఆదేశించాలని తన పిటిషన్‌లో ఆయన న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. సాక్షి ప్రసారాలను నిలిపేయాలని ఎంఎస్‌వోలకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలు ఇచ్చిన ఆదేశాలను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు.

 సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం
 హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీల చర్యలు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని రామచంద్రమూర్తి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేగాక ఇది రాజ్యాంగ హక్కులనూ ఉల్లంఘించడమేనన్నారు. ట్రాయ్ నిబంధనల ప్రకారం ఏదైనా టీవీ ప్రసారాల్ని నిలిపేయాలంటే మూడు వారాలముందు నోటీసులు జారీ చేసి, తగిన కారణాలను వివరించాల్సి ఉందన్నారు. అంతేగాక ప్రసారాలు నిలిపివేస్తున్న విషయాన్ని పత్రికాముఖంగా ప్రజలందరికీ తెలియచేయాల్సి ఉందన్నారు. అయితే తమ టీవీ ప్రసారాల నిలిపివేత విషయంలో ఎటువంటి నోటీసులు జారీ చేయలేదని తెలిపారు. ప్రసారాల నిలిపివేత అధికారం ట్రాయ్‌కు మాత్రమే ఉందన్నారు. అయితే ఇక్కడ మాత్రం హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీల ఆదేశాల మేరకు ఎంఎస్‌వోలు తమ చానల్ ప్రసారాలను నిలిపేశారని ఆయన కోర్టుకు నివేదించారు.

ఇలా చేసే అధికారం వీరికి లేదన్నారు. గతంలోనూ చట్టవిరుద్ధంగా ఇలా ప్రసారాలను నిలిపేయడాన్ని టెలికం వివాదాల పరిష్కార అప్పిలేట్ ట్రిబ్యునల్ (టీడీఎస్‌ఏటీ), సుప్రీంకోర్టులు తప్పుపట్టాయని గుర్తుచేశారు. చట్టనిబంధనలను ఏరకంగానూ సాక్షి టీవీ ఉల్లంఘించలేదని, అయినప్పటికీ తమ టీవీ ప్రసారాల్ని నిలిపివేయించారని తెలిపారు. ప్రభుత్వ విధానాల్లో లోపాల్ని ఎత్తిచూపుతున్నామన్న కారణంతో అన్యాయంగా, చట్టవిరుద్ధంగా తమ చానల్ ప్రసారాలను ఆపివేయించారన్నారు. చట్టవిరుద్ధ చర్యలకు పోలీసులను ఉపయోగిస్తున్నారని, అన్ని జిల్లాల ఎస్పీల ద్వారా ఆయా జిల్లాల్లోని ఎంఎస్‌వోలకు తమ టీవీ ప్రసారాల నిలుపుదలకు ఆదేశాలు జారీ చేయించారని వివరించారు. ప్రసారాల నిలుపుదల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమవలేదని, ఎంఎస్‌వోల ప్రభావమున్న మూడు తెలంగాణ జిల్లాల్లోనూ ఉందన్నారు.
 
 కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే..
  ప్రసారాల నిలుపుదల విషయాన్ని తాము లిఖితపూర్వంగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీల దృష్టికి తీసుకొచ్చామని, అయితే దీనిపై వారు ఏ రకంగానూ స్పందించలేదని, దీనివెనుక దురుద్దేశాలున్నాయని రామచంద్రమూర్తి తెలి పారు. సమాచార ప్రసరణ అన్నది భావ ప్రకటన హక్కులో భాగమని, దీనిని అడ్డుకోవడమంటే రాజ్యాంగ హక్కులను అడ్డుకోవడమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాల్లో లోపాలను ఎత్తిచూపుతున్నామన్న కారణంతో రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా తమ టీవీ ప్రసారాలను నిలుపుదల చేయించారని తెలిపారు. తమ ప్రసారాలను ప్రభుత్వమే నిలుపుదల చేయిం చిన విషయాన్ని డిప్యూటీ సీఎం బహిరంగం గా అంగీకరించారన్నారు. ప్రసారాల నిలిపివేతకు శాంతిభద్రతలను కారణంగా చూపుతున్నారని, అయితే అందుకు ఆధారాల్ని మా త్రం చూపట్లేదని వివరించారు. ప్రసారాలవల్ల శాంతిభద్రతల సమస్యలు వస్తాయని చెబితే సరిపోదన్నారు.

ప్రభుత్వ విధానాల్ని విమర్శించే వారిని ఓ పద్ధతి ప్రకారం నియంత్రించాలన్న ఉద్దేశంతోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలు ఇలా చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఉచ్చులో చిక్కనివారి పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఏపీ ప్రత్యేక కోర్టుల చట్టం కింద సాక్షి పత్రిక, టీవీ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి పత్రికాముఖం గా ప్రకటనలు చేశారన్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై వారు దురుద్దేశాలతోనే మాట్లాడారని తెలిపారు. మీడియా హక్కుల గురించి సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్పష్టమైన తీర్పులు వెలువరించిందని గుర్తుచేశారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీల చర్యలు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆయన న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. సాక్షి టీవీ ప్రసారాల విషయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోకుండా ప్రతివాదులకు ఆదేశాలివ్వాలని కోరారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా