కొన్నిసార్లు సిజేరియన్లు అనివార్యం

6 Aug, 2017 02:57 IST|Sakshi
కొన్నిసార్లు సిజేరియన్లు అనివార్యం
మాతా శిశువుల దీర్ఘకాల ప్రయోజనాలు ముఖ్యం
- దేశంలో కోత కాన్పులు 17 శాతమే  
అంతర్జాతీయ గైనకాలజిస్టుల సదస్సులో వక్తలు
 
సాక్షి, హైదరాబాద్‌: ఇటీవలి కాలంలో సిజేరియన్లు పెరగడం భారత్‌కే పరిమితం కాదని, అనేక కారణాల రీత్యా ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని పలువురు గైనకాలజిస్టులు అభిప్రాయపడ్డారు. పెళ్లిళ్లు, గర్భధారణలు అధిక వయసులో జరగడం, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలతో కొన్నిసార్లు ఇవి అనివార్యమవుతున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో మాతాశిశు సంక్షేమం, నవజాత శిశువుల ఆరోగ్యంపై అంతర్జాతీయ గైనకాలజిస్టుల సదస్సు ‘ఫాగ్‌సీ – ఫీగో – 2017 ప్రారంభమైంది. అనేక దేశాలకు చెందిన దాదాపు 1,500 మంది గైనకాలజిస్టులు ఇందులో పాల్గొన్నారు.

భారత్‌లో మొత్తం కాన్పుల్లో దాదాపు 17 శాతమే సిజేరియన్లు అని ఫాగ్‌సీ –ఫీగో ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డాక్టర్‌ ఎస్‌.శాంతకుమారి చెప్పారు. దక్షిణ అమెరికాకు చెందిన బొలీవియా, అర్జెంటీనా దేశాల్లో 70 శాతం కంటే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గైనకాలజిస్టుల కొరత తీవ్రంగా ఉందని, దీంతో సమస్య మరింత జటిలమవుతోందని ఆమె వివరించారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులపై దాడులు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వం తగురీతిలో స్పందించకపోతే అత్యవసర సేవలను నిలిపివేసేందుకూ వెనుకాడబోమని హెచ్చరించారు.
 
సంతానలేమి పెరుగుతోంది: రిష్మా ధిల్లోన్‌ పై
దేశంలో ఏటికేటికీ సంతాన లేమి సమస్య పెరుగుతోందని ఫాగ్‌సీ అధ్యక్షురాలు రిష్మా ధిల్లోన్‌ పై తెలిపారు. గడచిన 40 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా వీర్యకణాల సంఖ్య తగ్గుతోందని పేర్కొన్నారు. మానసిక ఒత్తిడి, కాలుష్యం తదితరాలు దీనికి కారణం కావొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు ప్రతినెలా  9న గర్భిణులకు ఉచిత సేవలు అందించేందుకు గైనకాలజిస్టులు చొరవ చూపుతున్నారని పేర్కొన్నారు. సురక్షితమైన కాన్పుల సంఖ్యను మరింతగా పెంచేందుకు నర్సులకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. మొత్తం పది లక్షల మందికి శిక్షణ ఇవ్వాలన్నది లక్ష్యమని సంస్థ కార్యదర్శి డాక్టర్‌ హేమా దివాకర్‌ తెలిపారు.  
 
వైద్యులను నమ్మాలి: ప్రొఫెసర్‌ సీఎన్‌ పురందరే
సిజేరియన్ల విషయంలో గైనకాలజిస్టులపై విమర్శలు వస్తున్నాయని, అయితే కొందరు తప్పితే చాలామంది డాక్టర్లు తమ శక్తి మేరకు తల్లీ బిడ్డల క్షేమం కోసం ప్రయత్నిస్తుంటారని ఫీగో చైర్మన్‌ ప్రొఫెసర్‌ సీఎన్‌ పురందరే స్పష్టం చేశారు. గర్భిణుల్లో 17 నుంచి 19 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్న వారు ఉంటున్నారని, సహజ కాన్పు వద్దని సిజేరియన్లే కావాలని కోరేవారి సంఖ్య కూడా పెరుగుతోందని చెప్పారు.
>
మరిన్ని వార్తలు