వాండర్ టీమ్

25 Aug, 2014 23:50 IST|Sakshi
వాండర్ టీమ్

వారు గ్రామీణ నేపథ్యమున్న విద్యార్థులు. అయితేనేం వారి ప్రతిభ గగనతలంలో ఘనతను చాటింది. ఉరిమే ఉత్సాహం ఊరికే ఉండనీయలేదు. ఏదైనా సాధించాలన్న తపన ఎప్పుడూ వెంటాడేది. మదిలో పుట్టిన ఓ ఐడియా వారి జీవితాన్నే మార్చింది. సినిమాలు, షికార్లకు గుడ్ బై చెప్పి ఆలోచనకు జీవం పోశారు. చదువుకుంటూనే నూతన ఆవిష్కరణకు నాంది పలికారు. పట్టుదలే పెట్టుబడిగా ముందుకు సాగారు. అంతే! వారి ఆశల ప్రతిరూపం.. ఎయిర్‌క్రాఫ్ట్ గగనతలంలో రయ్యిమంటూ దూసుకెళ్లింది. వారే శ్రీనిధి ‘సెవెన్ వండర్స్’... కటకం సంతోష్, సముద్రాల సంతోష్, ఎం.ధీరజ్, టీవీకే సుభాష్, ఎస్.రాకేశ్, టి.అమిత్, వివేక్ జైశ్వాల్.
 
వరంగల్ జిల్లా మర్రిపెడ బంగ్లాకు చెందిన కటకం సంతోష్ టీమ్ లీడర్. రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లోని శ్రీనిధి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టూడెంట్స్. 16 నెలలపాటు శ్రమించారు. 360 కిలోలు ఉండే ‘మాక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్’ను తయారు చేశారు. భూతలం నుంచి సుమారు కిలోమీటర్ ఎత్తులో ఎగరగలదు. ‘డీజీసీఏ అధికారులు  మా ఫ్యాబ్రికేషన్‌లో ఏ లోపం లేదని నిర్ధారించి సర్టిఫికెట్ ఇస్తారనుకుంటున్నాం. పరికరాలకు అవసరమైన డబ్బు మేమే సమకూర్చుకున్నాం. వ్యయప్రయాసలకోర్చి సమన్వయం చేసుకుంటూ సక్సెస్ సాధించాం’ అన్నాడు కటకం సంతోష్.  
 
మార్చిన ‘మూడు’...

ఇంజనీరింగ్ తొలి రెండేళ్లు సరదాగా గడిచింది. ఎంజాయ్ చేశారు.ఎక్కడికెళ్లాలన్నా ఈ ఏడుగురే ముందుండేది. సినిమాలు, షికార్లు మామూలే. ఏదో చేయాలన్న తపన  కొత్త ఆలోచనకు పురికొల్పింది. దీని నుంచి ఉద్భవించిందే ‘మాక్రోలైట్ ఎయిర్ క్రాఫ్ట్’. పైసాపైసా పోగేసి అనుకున్నది సాధించారు. లక్ష్యాన్ని ఛేదించారు. బుల్లి విమానాన్ని గగనతలంలో విహరింపజేసేందుకు సిద్ధమయ్యారు.
 
 తయారీ ఇలా..
 ‘టాటా నానో ఇంజిన్ 624 సీసీ, 38 పీఎస్, ట్రాస్ అల్యూమినియం పైప్‌లు వాడాం. బెంగళూరు నుంచి అల్యూమినియం అల్లాయ్ టైర్‌లు, ప్రొఫెల్లర్ బ్లేడ్(ఫ్యాన్) తెప్పించాం. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి బెంగళూరులోని ఏవియేషన్ సిస్టమ్స్ వాళ్లని కలిసి ఎలా పని చేయాలనే సలహాలు తీసుకున్నాం. గూగుల్ సెర్చ్ చేసి టెక్నిక్స్ నేర్చుకున్నాం. డిజైనింగ్ క్యాటియా అన్సిస్‌లో చేశాం. బాడీ లిఫ్ట్ ఫోర్స్ కోసం లో స్పీడ్ వింగ్ ప్రొఫైల్ వాడాం. లెఫ్ట్, రైట్ వింగ్ లెంత్ 12 ఫీట్. వింగ్ స్పాన్ 26.5 ఫీట్. టోటల్ బాడీ వెయిట్ 365 కేజీలు. పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ 25 లీటర్లు,’ అని సంతోష్ వివరించాడు. ‘ప్రస్తుతం మాక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను రన్‌వేపై నడుపుతున్నాం.
 
 ఇన్నాళ్లు మేం పడిన శ్రమకు ఫలితం దక్కడం ఎంతో ఆనందంగా ఉంది. ఆశించిన మేరకు కాలేజీ యాజమాన్యం ప్రోత్సహించింది. మా తల్లిదండ్రులు వెన్నుతట్టి ముందుకు నడిపించారు. వీరందరి ఆశీస్సులు, బాసటగా నిలువడం వల్లే ఈ రోజు ఎయిర్‌క్రాఫ్ట్ తయారు చేయగలిగాం’ అని టీమ్ మరో సభ్యుడు వివేక్ జైశ్వాల్ తెలిపారు.
- వాంకె శ్రీనివాస్

మరిన్ని వార్తలు