అక్టోబర్ 17 నుంచి సీపీఎం మహా పాదయాత్ర

4 Sep, 2016 02:23 IST|Sakshi

4 వేల కిలోమీటర్ల మేర యాత్ర

 సాక్షి, హైదరాబాద్: సామాజిక న్యాయ సాధనే ప్రధాన ఎజెండాగా రాష్ట్రవ్యాప్త మహా పాదయాత్రను అక్టోబర్ 17వ తేదీ నుంచి ప్రారంభించాలని సీపీఎం నిర్ణయించింది. వచ్చే ఏడాది మార్చి వరకు దాదాపు 4 వేల కిలోమీటర్ల మేర ఏకధాటిగా నిర్వహించనున్న ఈ పాదయాత్రకు అనుసరించాల్సిన కార్యాచరణను ఖరారు చేసింది. అక్టోబర్ 17న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పాదయాత్రను మొదలుపెట్టి మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి జిల్లాల మీదుగా హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభ ద్వారా ముగించనున్నారు.

ఈ యాత్రలో తమ్మినేని వీరభద్రం, ఇతర నాయకులు, కార్యకర్తలతో కూడిన ఒక బృందం పాల్గొననుండగా, ఏ జిల్లాకు ఆ జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొనేలా కార్యాచరణను రూపొందించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోసహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న అభివృద్ధి ప్రణాళికలు, చేపడుతున్న కార్యక్రమాల వల్ల అణగారిన వర్గాలకు నిజమైన లబ్ధి చేకూరడం లేదనే వాదనను ఈ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి  తీసుకెళ్లాలని నిర్ణయించింది.

 హైదరాబాద్‌ను రెండుగా చేయాలి
40 లక్షలకు పైగా జనాభా ఉన్న హైదరాబాద్‌ను విడదీసి సికింద్రాబాద్ జిల్లాను చేయాలనే డిమాండ్‌ను సీపీఎం ముందుకు తీసుకొస్తోంది. అలాగే అత్యధిక ప్రజలు కోరుకుంటున్న జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని, ఖమ్మంలో భద్రాచలం జిల్లాను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను ప్రభుత్వం వద్ద గట్టిగా వినిపించాలని నిర్ణయించింది. నల్లగొండ జిల్లాలో కొత్తగా 5 మండలాలు, ఇతర జిల్లాల్లో కొత్తగా మరిన్ని మండలాలను ఏర్పాటు చేయాలని మరోమారు జరగబోయే అఖిలపక్ష భేటీలో రాతపూర్వకంగా ప్రభుత్వానికి సమర్పించాలని నిర్ణయించింది.

మరిన్ని వార్తలు