ఇంధన ఉత్పత్తిలో ఎన్‌ఎఫ్‌సీ ప్రపంచ రికార్డు

10 Apr, 2016 03:56 IST|Sakshi
ఇంధన ఉత్పత్తిలో ఎన్‌ఎఫ్‌సీ ప్రపంచ రికార్డు

ఎన్‌ఎఫ్‌సీ చైర్మన్ డాక్టర్ సాయిబాబా

 సాక్షి, హైదరాబాద్: అతుకుల్లేని గొట్టాల తయారీలో ఉన్నతస్థాయి నైపుణ్యం సాధించిన ఎన్‌ఎఫ్‌సీ యురేనియం ఇంధన బండిళ్ల తయారీలోనూ ప్రపంచ రికార్డు సాధించిందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న న్యూక్లియర్ ఫ్యుయెల్ కాంప్లెక్స్ చైర్మన్ డాక్టర్ ఎన్. సాయిబాబా తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ  కెనడా ఏడాదికి 100 టన్నులు, జనరల్ ఎలక్ట్రిక్ 1,000 టన్నుల చొప్పున యురేనియం ఇంధన బండిళ్లను తయారు చేస్తుండగా, ఎన్‌ఎఫ్‌సీ 2015-16కుగాను 1,503 టన్నుల యురేనియం ఇంధన బండిళ్లను ఉత్పత్తి చేసిందని వివరించారు.

దేశంలోని అణురియాక్టర్లన్నింటికీ ఏటా 750 టన్నుల ఇంధన బండిళ్లు అవసరం కాగా.. ఎన్‌ఎఫ్‌సీ ఈ ఏడాది ఇందుకు రెట్టింపు  ఉత్పత్తి సాధించిందని సాయిబాబా చెప్పారు. ఎన్‌ఎఫ్‌సీ స్థాపిత సామర్థ్యం వంద టన్నులు మాత్రమే అయినా.. ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతను అలవర్చుకోవడం, తయారీ విధానాలకు మెరుగులు దిద్దడం ద్వారా అదనపు ఉత్పత్తి సాధించగలుగుతున్నామని చెప్పారు. ఎన్‌ఎఫ్‌సీ ఆధ్వర్యంలో ఖండాంతర క్షిపణి బ్రహ్మోస్‌లో ఉపయోగించే కీలకమైన గొట్టాలతోపాటు, ఇస్రో మూన్ మిషన్‌కు అవసరమైన ప్రత్యేక లోహాన్ని అభివృద్ధి చేయగలిగామన్నారు.

తేలికపాటి యుద్ధ విమానం తేజస్, పృథ్వీ, నాగ్ క్షిపణులు, అణుజలాంతర్గామిలో ఉపయోగించే వేర్వేరు లోహపు గొట్టాలను ఎన్‌ఎఫ్‌సీ తయారు చేస్తోందని తెలిపారు. దేశంలో ప్రస్తుతం 180 గిగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంటే అందులో అణుశక్తి వాటా మూడు శాతం మాత్రమేనని అన్నారు. అయితే, వచ్చే ఆరేళ్లలో ఏర్పాటు కానున్న కొత్త అణు రియాక్టర్లతో ఇది మరింత పెరుగుతుందని, 2030 నాటికల్లా మొత్తం 220 గిగావాట్ల విద్యుదుత్పత్తిలో 40 గిగావాట్లు అణుశక్తి ద్వారా అందుతుందని అన్నారు. కొత్తగా ఏర్పాటయ్యే అన్ని అణురియాక్టర్లను పరిగణనలోకి తీసుకుంటే 2030 నాటికి దాదాపు 2,800 టన్నుల అణు ఇంధనం అవసరమవుతుందని చెప్పారు.

మరిన్ని వార్తలు