T Congress: ఎమ్మెల్యేగా ఓడిపోతే ఇక అంతే.. మళ్లీ ఎంపీ టికెట్‌కు పోటీ లేదు

23 Nov, 2023 11:46 IST|Sakshi
తాజ్‌కృష్ణాలో కేసీ వేణుగోపాల్‌తో బల్మూరి వెంకట్, శివసేనారెడ్డి, ఠాక్రే తదితరలు

కేసీ మార్కు ‘రాజీ’కీయం 

టికెట్లు రాని 15 మందితో వేణుగోపాల్‌ భేటీ 

పార్టీకి మంచి రోజులు వస్తున్నాయని, భవిష్యత్తులో ప్రాధాన్యత కల్పిస్తామని హామీ 

షెట్కార్, సంజీవరెడ్డిల మధ్య సయోధ్య..నారాయణఖేడ్‌ టికెట్‌ మార్పు  

పలువురికి ఎంపీ టికెట్లపై వాగ్దానం.. జహీరాబాద్‌ ఎంపీగా షెట్కార్‌!

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయా లని ఆశించి టికెట్‌ రాక భంగపడిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలను ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్‌ తనదైన శైలిలో బుజ్జగించా రు. పార్టీకి మంచి రోజులు వస్తున్నాయంటూ నచ్చజెప్పారు. భవిష్యత్తులో ప్రాధాన్యత ఇస్తామని హా మీ ఇచ్చారు. పలువురికి ఎంపీ సీట్లపై హామీ ఇచ్చినట్లు కూడా సమాచారం.

నారాయణఖేడ్‌పై మీరే తేల్చుకోండంటూ నిర్ణయాన్ని ‘ఆ ఇద్దరికే’వదిలిపెట్టారు. ఒకరోజు పర్యటనకు గాను గురువారం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన అర్ధరాత్రి వరకు తాజ్‌కృష్ణా హోటల్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ నేతల తో సమావేశమయ్యారు. టికెట్లు రాని దాదాపు 15 మంది నేతలను పిలిపించి ఆయన స్వయంగా మాట్లాడారని సమాచారం. ముఖ్యంగా నారాయణఖేడ్‌ అసెంబ్లీ టికెట్‌ విషయంలో నెలకొన్న వివాదాన్ని ఆయన పరిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులకు ఎంపీ టికెట్ల విషయంలో హామీ ఇచ్చినట్టు గాందీభవన్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  

మీ ఇద్దరూ తేల్చుకోండి 
నారాయణఖేడ్‌ అసెంబ్లీ టికెట్‌ను జహీరాబాద్‌ మాజీ ఎంపీ సురేశ్‌ షెట్కార్‌కు కాంగ్రెస్‌ పార్టీ కేటాయించింది. అయితే మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల కిష్టా రెడ్డి కుమారుడు సంజీవరెడ్డి కూడా ఈ టికెట్‌ ఆశించారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు నేతలను పిలిపించిన కేసీవీ ఎవరికి టికెట్‌ కావాలో తేల్చుకుని తన దగ్గరకు వస్తే వారికే బీఫారం ఇస్తానని చెప్పినట్టు తెలిసింది. దీంతో ఆ ఇద్దరు నేతలు ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడుకున్నారని, ఈ భేటీలో భాగంగా సంజీవరెడ్డి అసెంబ్లీకి, షెట్కార్‌ లోక్‌సభకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని, అందుకే చివరి నిమిషంలో బీఫారంను సంజీవరెడ్డికి ఇచ్చారని సమాచారం. షెట్కార్‌ను జహీరాబాద్‌ లోక్‌సభకు పోటీ చేయిస్తామని కేసీవీ స్పష్టమైన హామీ ఇవ్వడంతో నారాయణఖేడ్‌ కథ సుఖాంతమైంది.  
చదవండి: కాంగ్రెస్‌ అభ్యర్థుల ఖర్చు కేసీఆరే ఇస్తున్నారు

మరికొందరికి కూడా.. 
ఇదే కోవలో కాంగ్రెస్‌ నేతలు బలరాం నాయక్, పారిజాతా నర్సింహారెడ్డి, గాలి అనిల్‌కుమార్, నాగరిగారి ప్రీతం, అద్దంకి దయాకర్, శివసేనారెడ్డి, బల్మూరి వెంకట్, బెల్లయ్య నాయక్‌ తదితరులతో కేసీవీ విడివిడిగా సమావేశమయ్యారు. వీరిలో బలరాం నాయక్‌ (మహబూబాబాద్‌), గాలి అనిల్‌కుమార్‌ (మెదక్‌)లకు లోక్‌సభ టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. అద్దంకి దయాకర్‌ (వరంగల్‌)ను కూడా పార్లమెంటుకు పోటీ చేయిస్తామని చెప్పినట్టు సమాచారం.  

ఎమ్మెల్యేగా ఓడిపోతే ఇక అంతే.. 
ఈ సమావేశాల్లో భాగంగా కేసీవీ మరో ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు పట్టుపట్టి ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాల్సిందేనని, ఒకవేళ ఓటమి పాలైతే మాత్రం మళ్లీ ఎంపీ టికెట్లకు పోటీకి రాకూడదని ఆయన సూచించినట్టు తెలిసింది. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డిలతో కేసీవీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఇద్దరు యువ నాయకులకు పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని, టికెట్‌ రానంత మాత్రాన అసంతృప్తి చెందాల్సిన పని లేదని చెప్పారని గాం«దీభవన్‌ వర్గాలు తెలిపాయి. బల్మూరి గురించి బోసురాజు ఏదో చెప్పబోగా.. ‘వెంకట్‌ గురించి అధిష్టానానికి తెలు సు. ఈ ప్రభుత్వంపై పార్టీ పక్షాన గట్టి పోరాటం చేశాడు. 60కి పైగా కేసులు నమోదయ్యాయి. జైలు కు కూడా వెళ్లి వచ్చాడు. రాహుల్‌గాంధీ జైలుకు వెళ్లి వెంకట్‌ను పరామర్శించారు..’అని వేణుగోపాల్‌ అ న్నారు.

వెంకట్‌ రాజకీయ భవిష్యత్తుపై తాను వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటానని, పార్టీ కూడా వెంకట్‌కు తగిన ప్రాధాన్యతనిస్తుందని హామీ ఇచ్చినట్టు సమాచారం. కాగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్‌ నుంచి బల్మూరి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో వైపు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫోన్‌లో కేసీవీ తో మాట్లాడారని తెలుస్తోంది. అయితే ఆయన ఏం మాట్లాడారనేది పార్టీ వర్గాలు గోప్యంగా ఉంచాయి. కాగా వేణుగోపాల్‌ శుక్రవారం ఉదయం 6:30 సమయంలో ఢిల్లీ వెళ్లారు.

మరిన్ని వార్తలు