‘కేసు’ తేలాల్సిందే..

11 Jan, 2015 00:55 IST|Sakshi
‘కేసు’ తేలాల్సిందే..

దర్యాప్తు పక్కదారి పట్టకుండా చర్యలు
శిక్షల శాతం పెంచడమే లక్ష్యం
కోర్టు మానిటరింగ్ సిస్టం(సీఎంఎస్) ఏర్పాటు
వీటి కోసం ప్రత్యేక సబ్ కంట్రోల్స్

 
సిటీబ్యూరో: తెలంగాణలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు జంట పోలీసు కమిషనర్లు ఎం.మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్‌లు చేపట్టిన విప్లవాత్మకమైన మార్పులు మంచి ఫలితాలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా కేసుల్లో నిందితులకు శిక్షల శాతాన్ని పెంచే దిశగా వారు కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.  ఫిర్యాదు దారులకు ఊరట కల్పించి, సత్వర న్యాయం, నిష్పక్షపాత దర్యాప్తు అందించేందుకు మరో అడుగు ముందుకేసిన జంట పోలీసు కమిషనర్లు  త్వరలో ‘కోర్టు మానిటరింగ్ సిస్టం’ (సీఎంఎస్)ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం నగరంలో రెండ్ సీఎంఎస్ సబ్ కంట్రోల్స్‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులతో తర్జనబర్జన చేశారు. నగర నేర పరిశోధక విభాగం (సీసీఎస్)లో ఒక సబ్ కంట్రోల్, నార్త్‌జోన్ కేంద్రంగా అక్కడి డీసీపీ కార్యాలయంలో మరో సబ్‌కంట్రోల్‌ను ఏర్పాటు చేయాలని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి  ఆదేశాలు జారీ చేశారు. సైబరాబాద్‌లో కూడా ఎల్బీనగర్, మియాపూర్, రాజేంద్రనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, కూకట్‌పల్లి కోర్టు సమీపంలో సబ్ కంట్రోల్‌లు ఏర్పాటు చేసేందుకు కమిషన్ సీవీ ఆనంద్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం ఇలా..

బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న స్టేషన్ ఎస్‌ఐ లేక ఇన్‌స్పెక్టర్ దర్యాప్తు అధికారిగా ఉంటారు. నిందితుడిని అరెస్టు చేసి,  సాక్ష్యాలను సేకరించి వారి వాగ్మూలం రికార్డు చేస్తారు. అనంతరం చార్జీషీట్ కోర్టుకు సమర్పించడం వరకు బాధ్యతంతా స్టేషన్ అధికారులదే. అయితే వీరిలో కొందరు ఇన్వెస్టిగేషన్ అధికారులు నిందితులతో కుమ్మక్కై ఇష్టం వచ్చినట్లు వారికి బెయిల్ మంజూరయ్యే విధంగా మసులుకోవడం, చార్జీషీట్లను సులభతరం చేసి శిక్ష పడకుండా కాపాడటం, దర్యాప్తు కావాలనే ఆలస్యం చేయడం, తప్పుడు సాక్ష్యాలను సమర్పించడం, దీంతో కోర్టులో కేసు వీగిపోవడం జరిగేవి.  కొన్ని సందర్భాలలో ఏళ్లు గడిచినా చార్జీషీట్లు దాఖలు చేసేవారు కాదు. ఇటువంటి పెండింగ్ కేసుల దుమ్ము దులిపేందుకు ఐదు నెలలుగా జంట పోలీసు కమిషనరేట్లలో ‘యూఐ మేళా’ పేరుతో క్లియర్ చేశారు. గత ఏడాది సుమారు 10 వేల కేసులు కొలిక్కి తెచ్చి బాధితులకు న్యాయం చేయగలిగారు. అయితే మున్ముందు ఇలా కాకుండా కేసు ఎఫ్‌ఐఆర్ జరిగిన మరు క్షణం నుంచి నిందితులకు శిక్ష పడే వరకు జరిగే ప్రక్రియను వేగవంతం చేసేందుకు అన్ని జిల్లాల్లో కోర్టు మానిటరింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని ఇటీవలే డీజీపీ అనురాగ్‌శర్మ ఆదేశాలు జారీ చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని జంట కమిషనరేట్లలో ఈ నెల చివరి నాటికి సీఎంఎస్‌ను ప్రవేశపట్టేందుకు పనులు వేగవంతం అయ్యాయి.
 
సీఎంఎస్‌తో ఇలా..


 బాధితుడు దరఖాస్తు చేయగానే సంబంధింత స్టేషన్ అధికారి ఎఫ్‌ఐఆర్ చేస్తారు. ఈ కాపీ సంబంధింత సీఎంఎస్ సబ్‌కంట్రోల్ అధికారులకు చేరుతుంది. స్టేషన్ అధికారి అరెస్టుల్లో ఆలస్యం చేస్తే సీఎంఎస్ అధికారులకు ప్రశ్నించే అధికారం ఉంది. అలాగే ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న మాదిరిగా సాక్షుల వాంగ్మూలం కూడా సరైన పద్దతుల్లో తీసుకోవాల్సి వస్తుంది. చార్జీషీటు కూడా శిక్ష పడే విధంగా తయారు చేయడంలో సీఎంఎస్ కీలక పాత్ర పోషిస్తుంది. ఠాణా అధికారులు కేవలం ఎఫ్‌ఐఆర్ చేయడం, నిందితులను అరెస్టు చేయడం వరకే వారి విధి. ఆ తరువాత ఆ కేసు కోర్టులో వేగవంతం చేయడం, నిందితులకు శిక్షలు పడేలా వ్యవహరించడం సీఎంఎస్ విధి. కోర్టు నుంచి జారీ అయ్యే యన్‌బీడబ్ల్యూ అరెస్టు వారెంట్లు కూడా సీఎంఎస్ ద్వారానే సాక్షులు, నిందితులు, బాధితులకు అందిస్తారు.
 
డీఐజీ పర్యవేక్షణలో...

డీఐజీ పర్యవేక్షణలో కోర్టు మానిటరింగ్ సిస్టం పనిచేస్తుంది. ఒక్కో సబ్‌కంట్రోల్‌కు ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐతో పాటు 10 మంది సాఫ్ట్‌వేర్ నిపుణులు, ప్రతి స్టేషన్ నుంచి ఏఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉంటారు. నగరంలో 63, సైబరాబాద్‌లో 43 శాంతి భద్రతల పోలీసు స్టేషన్‌లతో పాటు సైబర్ క్రైమ్, సీసీఎస్‌లకు చెందిన కేసులు అన్ని కూడా సీఎంఎస్ ఆధ్వర్యంలో ముందుకు సాగుతాయి.
 
వెబ్‌సైట్‌లో  వివరాలు..

ఒక కేసుకు సంబంధించి వాయిదాకు ఎవరు వచ్చారు, ఆ రోజు కోర్టులో ప్రక్రియ ఎలా సాగింది, తదుపరి కేసు విచారణ ఏ తేదీకి వాయిదా పడింది తదితర వివరాలు పోలీసు వెబ్‌సైట్ ద్వారా అందరు తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో బాధితులు, నిందితులు సులభంగా వివరాలు తెలుసుకోవచ్చు.
 
అంతా పారదర్శకం..

కోర్టు మానిటరింగ్ సిస్టం ద్వారా బాధితులకు సత్వర న్యాయం అందుతుంది. నిందితుల శిక్షల శాతం కూడా పెరుగుతుంది. ఎఫ్‌ఐఆర్ నుంచి శిక్ష పడే వరకే జరిగే ప్రక్రియ అంతా నిస్పక్షపాతంగా, పారదర్శకంగా జరుగుతుంది. నిందితులతో పోలీసులు కుమ్మక్కయే ప్రసక్తే ఉండదు. దీంతో బాధితులకు పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.
   
 - జంట కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్
 
 

మరిన్ని వార్తలు