డబుల్ ట్రబుల్

26 Jun, 2014 01:07 IST|Sakshi
డబుల్ ట్రబుల్

ట్రాఫిక్‌పై ఉమ్మడి రాజధాని ప్రభావం
 
హైదరాబాద్: ‘ఉమ్మడి’ నగరం హైదరాబాద్‌లో ఇప్పుడు అంతా డబుల్. ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇద్దరు ప్రతిపక్ష నేతలు, ఇద్దరు స్పీకర్లు, నలుగురు ఉప ముఖ్యమంత్రులు,  అన్ని శాఖలకు ఇద్దరేసి చొప్పున మంత్రుల రాకపోకలతో నగరంలో ట్రాఫిక్  సీన్ మారిపోయింది. సిటీ ఉమ్మడి రాజధాని కావడంతో పోలీసు విభాగంపై భారం రెండింతలయింది. వీవీఐపీలు రాకపోకలు సాగించే మార్గాల్లో ట్రాఫిక్ ఇక్కట్లు తప్పటం లేదు. అయితే  ఉమ్మడి ప్రముఖుల అంశం అత్యంత సున్నితమైందని, ఏమరుపాటు వహిస్తే అనవసర అపార్థాలకు తావిచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ ఇబ్బందులు భరించక తప్పదంటూ ఉన్నతాధికారులు చెప్పకనే చెబుతున్నారు.

రెట్టింపైన ప్రముఖుల జాబితా...

సిటీ ఉమ్మడి రాజధాని కావడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన ఈ అత్యంత ప్రముఖులంతా అత్యధిక సమయం నగరంలోనే ఉండాల్సిన పరిస్థితి. దీంతో ట్రాఫిక్ ఆపాల్సిన సందర్భాలు పెరుగుతున్నాయి. అత్యంత ప్రముఖులుగా పరిగణించే రాజ్యాంగ, రాజకీయ హోదా కలిగిన వారి కాన్వాయ్‌ల కదలికల నేపథ్యంలో సిటీ రోడ్లు, కీలక జంక్షన్లలో ట్రాఫిక్ ఆపడం అనివార్యంగా మారింది. దీన్నే సాంకేతిక పరిభాషలో ‘గ్రీన్ ఛానల్’ కల్పించడం అంటారు. అంటే ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రముఖులు వెళ్లడానికి కల్పించే సౌకర్యం. వారి హోదా మాత్రమే కాకుండా భద్రతాకారణాల దృష్ట్యా ఇది అనివార్యం. వీరు ప్రయాణిస్తున్న వాహనాలు, కాన్వాయ్‌లు ఆయా ప్రాంతాలను దాటి వెళ్లే వరకు ఆ పరిధిలోని మార్గంలో ఇతర వాహనాలను అనుమతించరు. ఒకప్పుడు ఈ కాన్వాయ్‌లు ప్రయాణిస్తున్న సందర్భంలో వాటి దిశకు వ్యతిరేకంగా వచ్చే వాహనాలను సైతం ఆపేవారు. ఈ పరిస్థితుల్ని చక్కదిద్దినప్పటికీ రోజూ కనిష్టంగా 40 చోట్ల వాహనాలను ఆపాల్సి వచ్చేది. ప్రస్తుతం ఉమ్మడి రాజధానిలో పెరిగిన ప్రముఖుల కారణంగా ఈ సంఖ్య 80కి చేరింది.

రద్దీ ప్రాంతాల్లోనే అత్యధికం...

నగరంలోని ప్రముఖుల నివాసాలు, కార్యాలయాలు, పరిపాలన తదితర కార్యకలాపాలు సాగించే ప్రాంతాలు ఎక్కువ పశ్చిమ(బంజారాహిల్స్, జూబ్లీహిల్స్), మధ్య మండలం (అబిడ్స్, ముషీరాబాద్, సైఫాబాద్). ఈ ప్రాంతాల్లోనే ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువ. పీక్ అవర్స్‌గా పిలిచే రద్దీ వేళల్లోనే ఉంటున్నాయి. మరోపక్క సాఫ్ట్‌వేర్  హబ్‌గా ఉన్న హైటెక్ సిటీ చుట్టుపక్కల ప్రాంతాలకు నగరం నుంచి ప్రయాణించే వాహనాలు పశ్చిమ మండలం మీదుగానే వెళ్తుంటాయి. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆపితే సాధారణ స్థితికి తీసుకురావడానికి 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతోంది.

ఆ మండలాలపై అధిక భారం...

ఉమ్మడి రాజధాని ప్రభావం నగరంలో ఉండే ప్రముఖుల్లో దాదాపు 80 శాతం మంది నివసించే పశ్చిమ మండలంతో పాటు ఉభయ రాష్ట్రాల శాసనసభలు ఉన్న మధ్య మండల పోలీసులపై అత్యధికంగా ఉంటోంది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలతో సహా ఇతర మంత్రులు పశ్చిమ మండలంలోనే ఉంటున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాలు ఒకే సముదాయంలో జరుగుతున్నాయి. వీటికి పూర్తిస్థాయిలో భద్రత ఏర్పాటు చేయడంతో పాటు భారీ స్థాయిలో సిబ్బందిని మోహరిస్తున్నారు. గతంలో ఏటా నెలరోజులకు పైగా అసెంబ్లీ బందోబస్తును నిర్వహిస్తే, ఇకపై రెండు నెలలకు పైగా నిర్వహించాల్సి ఉంటుంది. ఈ భారం మధ్య మండల పోలీసులపై పడుతోంది. అలాగే రెట్టింపైన ప్రముఖుల నివాసాలకు భద్రత, బందోబస్తు కల్పించడం పశ్చిమ మండల అధికారులపై పడుతున్న మరో భారం.

అంతర్గత భద్రత అప్పగించే ప్రతిపాదన...

ఉమ్మడి రాజధాని దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ సచివాలయం, ఇతర కార్యాలయాలతో పాటు ముఖ్యమంత్రి, మంత్రుల, అధికారుల నివాసాలు 10 ఏళ్లు హైదరాబాద్‌లోనే కొనసాగనున్నాయి. అయితే వీటి భద్రత ఏపీ అధికారులే చూసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. జంట కమిషనర్లు ప్రతిపాదించినట్లు అదనపు సిబ్బందిని ప్రభుత్వం కేటాయించినా.. భర్తీ చేయడం తక్షణం సాధ్యం కాని నేపథ్యంలో ఈ ప్రతిపాదన తెరపైకి వస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు మార్షల్స్ సహా బందోబస్తుకు ఏపీ నుంచి కొందరు అధికారుల్ని రప్పించారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కీలక కార్యాలయాల వద్ద భద్రత, బందోబస్తు విధుల్లో ఉండేందుకు సిబ్బందిని రొటేషన్ పద్దతిపైన ఏపీ నుంచి తీసుకువస్తే ఈ భారం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. వ్యక్తిగత భద్రతా అధికారుల్ని సైతం అక్కడ నుంచే పంపేలా చూడాలని ప్రతిపాదించనున్నారు. అలాగే, నిర్దిష్టమైన ఫిర్యాదు వచ్చినప్పుడు మాత్రమే ఆ కార్యాలయం ఏ ఠాణా పరిధిలో ఉంటే వారు కలగజేసుకుంటారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్‌లో ఇదే పద్ధతి కొనసాగుతోంది.
 
 
వీళ్లొస్తే మన బండి ఆగాల్సిందే..

⇒ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
⇒ తెలంగాణ, ఏపీముఖ్యమంత్రులు
⇒ శాసనసభ, మండలిల్లోని నలుగురు ప్రతిపక్ష నేతలు
⇒ ఉభయసభల ఇద్దరు స్పీకర్లు, ఇద్దరు డిప్యూటీ స్పీకర్లు
⇒ 2 రాష్ట్రాల నలుగురు డిప్యూటీ సీఎంలు
⇒ తెలంగాణ, ఏపీ హోం మంత్రులు
⇒ ఇరు రాష్ట్రాల డీజీపీలు
 
 రోజుకు ఎన్నిసార్లంటే...

 ఈ 19 మంది ఒక్కసారి కార్యాలయాలకు వెళ్లి రావాలన్నా 38 సార్లు ఆపాల్సిందే.అసెంబ్లీ సమావేశాలుంటే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది.సభలు, సమావేశాలు, ప్రత్యేక సందర్భాల్లో 80 సార్లకు పైగా ఆపాల్సిన పరిస్థితి.అత్యధికంగా ట్రాఫిక్‌ను పీక్ అవర్స్‌లో రద్దీ ప్రాంతాల్లోనే ఆపాల్సి వస్తోంది.
 

మరిన్ని వార్తలు