కిరాయిదారులపై నిఘా

28 Jan, 2014 01:55 IST|Sakshi
కిరాయిదారులపై నిఘా
 • అద్దెకుండే వారి వివరాలతో డేటాబేస్
 •   ముష్కరుల ఆగడాలకు చెక్ చెప్పేందుకే
 •   ఠాణాల వారీగా వివరాల సేకరణకు నిర్ణయం
 •   ప్రణాళికలు సిద్ధం చేసిన సైబరాబాద్ సీపీ
 •  
   సాక్షి, సిటీబ్యూరో: 2007 ఆగస్టు, 2013 ఫిబ్రవరి... ఉత్తరాది నుంచి వచ్చిన ముగ్గురు ముష్కరులు హబ్సిగూడ, అబ్దుల్లాపూర్‌మెట్‌ల్లో మకాం పెట్టారు... లుంబినీపార్క్, గోకుల్‌చాట్, దిల్‌సుఖ్‌నగర్‌ల్లో బాంబులు పేల్చి 59 మందిని బలి తీసుకున్నారు... ముంబై మోడల్‌ని ఈవెంట్ పేరుతో తీసుకువచ్చిన దండుగులు నిజాంపేట్‌లోని ఇంట్లో బంధించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ పరిణామాల్ని పరిగణలోకి తీసుకున్న సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ టెనెంట్స్ వాచ్ (అద్దెకుండే వారిపై నిఘా) కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
   
   ఇవీ విధి విధానాలు...
   ‘టెనెంట్స్ వాచ్ ఫామ్’ దరఖాస్తుల్ని ముద్రించి అన్ని ఠాణాల్లో అందుబాటులో ఉంచుతారు.
   
   ఇంటి యజమానులంతా వీటిని తీసుకోవాలి.
   
   తమ ఇంట్లో అద్దెకుండే వారి పూర్తి వివరాలు నమోదు చేసి, వారి గుర్తింపు పత్రాలతో పాటు ఫొటోలనూ జత చేసి పోలీసు స్టేషన్‌లో అప్పగించాలి.
   
   ఈ అంశాన్ని మరింత సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రచారం నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు.
   
   మరోపక్క స్థానిక ఇన్‌స్పెక్టర్లు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తన పరిధిలో టెనెంట్స్ వాచ్ అమలును తనిఖీ చేయాలి.
   
   కేవలం వివరాలు సేకరించి వదిలిపెట్టకుండా ఫొటోలతో సహా టెనెంట్స్ డేటాబేస్ రూపకల్పనకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు.
   
   భవిష్యత్తులో సైబరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో అద్దెకున్న వారి వివరాలన్నీ సెంట్రల్ సర్వర్‌లో ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని, దీన్ని పోలీసు విభాగం వినియోగించే ఇంట్రానెట్‌కు కనెక్ట్ చేస్తారు.
   
   శివార్లలో కాలేజీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు ఐటీ హబ్‌లోనూ టెనెంట్స్ వాచ్ తప్పనిసరి చేసి ఉల్లంఘించిన ఇంటి యజమానులపై చర్యలకు అవకాశాలు పరిశీలిస్తున్నారు.
   
   ఈ టెనెంట్స్‌వాచ్ అమలుతో ముష్కరులకు షెల్టర్ దొరక్కుండా చేయడంతో పాటు ఏదైనా జరగరానిది జరిగినప్పుడు దర్యాప్తు తేలికవుతుందని అధికారులు భావిస్తున్నారు.
   
   ఠాణాల వారీగా వివరాల సేకరణ...
   నగరానికి ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందంటూ నిఘా వర్గాల నుంచి తరచు హెచ్చరికలు అందుతూనే ఉన్నాయి. మరోపక్క ఇతర ప్రాంతా లు, రాష్ట్రాల నుంచి వస్తున్న దృష్టి మరల్చి చోరీలు చేసే ముఠాలు, దోపిడీ దొంగలకూ అద్దె ఇళ్లే అడ్డాలు గా మారుతున్నాయి. ఇలా వస్తున్న ముష్కరులకు షెల్టర్ దొరక్కుండా చేయాలనే ఉద్దేశంతోనే సైబరాబాద్ పోలీసులు ఈ టెనెంట్స్ వాచ్‌ను అమలు చేస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో 41 శాంతి భద్రతల ఠా ణాలకు ఈ బాధ్యతల్ని అప్పగించనున్నారు. టెనెం ట్స్ వాచ్‌కు సంబంధించిన విధి విధానాలను సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ రూపకల్పన చేస్తున్నారు.
   
   డిజైన్ సిద్ధం చేశాం....
   ముష్కరమూకలతో పాటు అసాంఘికశక్తులకు చెక్ చెప్పే చర్యల్లో భాగంగా టెనెంట్స్ వాచ్‌ను పక్కాగా అమలు చేయాలని నిర్ణయించాం. ఇందుకు సంబంధించి న విధి విధానాల డిజైన్‌ను పూర్తి చేశాం. ప్రస్తుతం దీనికి తుదిమెరుగులు దిద్దుతున్నాం. పూర్తిస్థాయి స్వరూపం వచ్చాక ఠాణా ల వారీగా త్వరలోనే అమలు చేస్తాం. అద్దెకుండే వారి వివరాల సేకరణను తప్పనిసరి చేస్తాం.    
   - సీవీ ఆనంద్, సైబరాబాద్  పోలీసు కమిషనర్
   

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా