వీరులెవ్వరో..?

10 Jan, 2016 04:23 IST|Sakshi
వీరులెవ్వరో..?

గ్రేటర్ రిజర్వేషన్లు..ఎన్నికల షెడ్యూల్ వచ్చేశాయ్. రాజకీయ పార్టీల్లో హడావుడి మొదలైంది. ఎవరికి వారు వ్యూహ ప్రతి వ్యూహాల్లో మునిగిపోయారు. కార్పొరేటర్ టిక్కెట్లు ఆశిస్తున్న నేతలు రంగంలోకి దిగారు. రిజర్వేషన్ల కారణంగా కొందరు నిరాశకు గురైనా...వెంటనే తేరుకుని బంధువులను బరిలో నిలిపేందుకు పావులు కదుపుతున్నారు. ఇక ఆయా పార్టీల పెద్దలు..గెలుపు గుర్రాల కోసం వేట మొదలెట్టారు. ఎవరి బలం ఏమిటి.. టికెటిస్తే నిలిచి..గెలిచి సత్తా చాటుతారా.. వారి నేపథ్యం, స్తోమత, పలుకుబడి, ఆర్థిక, సామాజిక స్థితిగతుల గురించి ఆరా తీస్తున్నారు. రిజర్వేషన్లతో మారిన పరిస్థితులకనుగుణంగా మళ్లీ అభ్యర్థుల ఎంపిక,  గెలుపోటములపై బేరీజులు... అంచనాలు వేస్తున్నారు. మొత్తంగా గ్రేటర్ రాజకీయం వేడెక్కింది.
 - సాక్షి ప్రతినిధి, హైదరాబాద్
 
 మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థుల కోసం ఆయా పార్టీలు వేట మొదలుపెట్టాయి. ఊహకు భిన్నంగా డివిజన్ల రిజర్వేషన్లు రావటంతో అధికార పార్టీ సహా అన్నీ పార్టీలు ఒకింత అయోమయానికి గురయ్యాయి. దీంతో ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపిక కసరత్తును మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాయి. ఆర్థికంగా, సామాజికంగా బలమైన వర్గాల కోసం వెతుకులాట ముమ్మరం చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో  మహిళలకు సగం స్థానాలు రిజర్వు కావటంతో (2011 చట్ట సవరణ మేరకు స్థానిక సంస్థల్లో 50 శాతం స్థానాలు) తాము పోటీ చేయదలుచుకున్న డివిజన్లలో తమ భార్యలు, తల్లులు, బిడ్డలు, కోడళ్లను పోటీలో నిలిపేందుకు కసరత్తు ప్రారంభించారు.గత పాలకవర్గంలో కార్పొరేటర్లుగా పనిచేసిన వారిలో నూటికి 90 శాతం మందికి ఈ మారు అదే కేటగిరీలో అవకాశం లేకుండా పోయింది. రెండో సారి కార్పొరేటర్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న నాయకులు తమకు అనుకూల రిజర్వేషన్ వచ్చిన పక్క ప్రాంతానికి షిఫ్టవుతున్నారు.

 తాజా మాజీల స్థానమార్పిడి...: తాజా మాజీ కార్పొరేటర్లలో కేవలం పది శాతం మంది మాత్రమే మళ్లీ పోటీకి సిద్ధం అవుతున్నారు. మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి(తార్నాక జనరల్ మహిళ)కు రిజర్వేషన్ అనుకూలంగా వచ్చినా ఆమె పోటీపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మాజీ డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్ భార్యకు(కవాడిగూడ ఎస్సీ మహిళ) అనుకూలంగా వచ్చినా ఆయన పోటీకి దూరంగానే ఉండే అవకాశం ఉంది. హఫీజ్‌పేట మాజీ కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్ ఈ మారు మాదాపూర్ నుంచి, శ్రీనగర్ కాలనీ మాజీ కార్పొరేటర్ అత్తలూరి విజయలక్ష్మి సోమాజిగూడ నుంచి, బంజారాహిల్స్ మాజీ కార్పొరేటర్ భారతి ఈమారు వెంకటేశ్వరనగర్ నుంచి పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.
 
 తెరపైకి.. బంధుగణం
 నగరపాలక ఎన్నికల్లో మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో నగరానికి చెందిన పలువురు నేతలు తమ కుటుంబసభ్యుల్ని బరిలోకి దించాలని నిర్ణయించారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాసరెడ్డి ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్(జనరల్) నుంచి పోటీ చేసేందుకు శనివారమే ప్రచారాన్ని ప్రారంభించారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు చింతల విజయశాంతి అల్వాల్(మహిళా జనరల్), కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత అడ్డగుట్ట(ఎస్సీ మహిళ) లేదా కవాడిగూడలలో ఒకచోట నుంచి బరిలోకి దిగనున్నారు.

మాజీ మంత్రి పి.జనార్దనరెడ్డి కూతురు పి.విజయారెడ్డి ఖైరతాబాద్ నియోకజవర్గంలోని వెంకటేశ్వరకాలనీ(మహిళ జనరల్) స్థానం నుంచి పోటీ చేయడం ఖాయమైంది. ఎంపీ కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మి బంజారాహిల్స్, మాజీ మంత్రి విజయరామారావు కూతురు అన్నపూర్ణ జూబ్లీహిల్స్ డివిజన్ నుంచి బరిలోకి దిగే యోచనలో ఉన్నారు. ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరిన రంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు కేఎం ప్రతాప్ భార్య పద్మ జీడిమెట్ల, జీహెచ్‌ఎంసీలో టీడీపీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సతీమణి సర్వలత సైదాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసే ఏర్పాట్లు చేసుకున్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డి జూబ్లీహిల్స్ నుంచి, నగర బీజేపీ అధ్యక్షులు వెంకట్‌రెడ్డి సతీమణి పద్మ బాగ్ అంబర్ పేట నుంచి పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. అలాగే టీఆర్‌ఎస్ నేత గొట్టిముక్కల పద్మారావు సోదరుడు వెంకటేశ్వరరావు కూకట్‌పల్లి టికెట్ ఆశిస్తున్నారు. టీడీపీ నేత ఆనంద్‌కుమార్ గౌడ్ సతీమణి మంజుల కూడా టికెట్ ఆశిస్తున్నారు.

మరిన్ని వార్తలు