ప్రాణాలు శిథిలం

29 Jul, 2013 16:03 IST|Sakshi
ప్రాణాలు శిథిలం

మల్కాజిగిరి/మౌలాలి, న్యూస్‌లైన్: వలసజీవులపై మృత్యువు పంజా విసిరింది. తెల్లారితే స్వగ్రామంలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లాల్సి ఉంది. అంతలోనే ప్రాణాలు ‘శిథిల’మైపోయాయి. సికింద్రాబాద్‌లో సిటీలైట్ హోటల్ కుప్పకూలిన ఘటన మరువకముందే మౌలాలిలో సోమవారం అర్ధరాత్రి తరువాత పురాతన గోడ కుప్పకూలిన ఉదంతం తీరని విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో మరణించిన వారంతా రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన రెండు కుటుంబాల వారే.

ఏళ్లుగా ఈ ప్రాంతంలో గుడిసెలు వేసుకుని ఉంటూ ఇళ్లలో పని చేస్తూ పొట్టపోసుకుంటున్నారు. వెంకటయ్యది రంగారెడ్డి జిల్లా యాలాల మండలం మల్‌రెడ్డిపల్లి. మహాదేవ్ స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా కొత్వాబాద్. ప్రస్తుతం పంచాయితీ ఎన్నికల జరుగుతుండటంతో సోమవారమే రెండు కుటుంబాలు స్వగ్రామాలకు వెళ్లాలని భావించాయి. అయితే వర్షం కారణంగా ప్రయాణం రద్దు చేసుకున్నారు. అదే వారి పాలిట శాపమైంది.

బావ, బావమరిది కుటుంబాల్లో విషాదం
వెంకటయ్య, మహాదేవ్ బావా బావమరుదులు. మౌలాలి ఎంజే కాలనీలోని ఓ పురాతన గోడ పక్కగా రెండు గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. సోమవారం అర్ధరాత్రి దాటాక గోడ ఒక్కసారిగా కుప్పకూలి వీరి గుడిసెలపై పడింది. దుర్ఘటనలో మహాదేవ్ దంపతులు, వీరి పిల్లలు అనిల్‌కుమార్, శివకుమార్, వెంకటయ్య దంపతులు అక్కడికక్కడే చనిపోయారు. వెంకటయ్య పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. మహదేవ్ భార్య పద్మ వెంకటయ్యకు సోదరి. కాగా, ఉదంతం జరిగిన వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులూ ఘటనా స్థలికి చేరుకున్నారు. 2.30 సమయంలో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.

జీహెచ్‌ఎంసీ అధికారులు పంపిన జేసీబీ సాయంతో చేపట్టిన పనులు సరైన వెలుతురు, లైట్లు లేని కారణంగా మందకొడిగా సాగాయి. దాదాపు 4 గంటల ప్రాంతంలో ఆరు మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటంబాలకు న్యాయం చేయాలని, ప్రమాదానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జేఏసీ నేతలు ఆందోళన చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. అధికారులు కాస్త వేగంగా స్పందించి ఉంటే మరికొన్ని ప్రాణాలు దక్కేవని స్థానికులు ఆరోపించారు.

100 ఏళ్ల నాటి గానుగ సున్నం గోడ
మౌలాలి ఏంజే కాలనీలో అజీజ్‌కు స్థలం ఉంది. దీనికి రెండు వైపులా గతంలో ఓ క్వారీ నడవడంతో స్థలం భారీ బండరాయిపై మిగిలింది. దీనికి వెనుక వైపు దాదాపు వందేళ్ల క్రితం గానుగ సున్నం, గ్రానైట్ రాళ్లతో నిర్మించిన పురాతన గోడ ఉంది. అజీజ్ ఇటీవల తన స్థలాన్ని శ్రీధర్, రమణ అనే బిల్డర్స్‌కు అపార్ట్‌మెంట్ నిర్మించే నిమిత్తం ఇచ్చారు. నిర్మాణాన్ని ప్రారంభించిన వీరు నిర్మాణానికి వెనక వైపున పురాతన గోడ వరకు దాదాపు 25 అడుగులకు పైగా మట్టిని పోసి నింపారు. ప్రస్తుతం ఈ బహుళ అంతస్తుల భవనం గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ వరకు బేస్‌మెంట్, పిల్లర్లు, బీమ్‌లు, స్లాబ్ పనులు పూర్తి చేసుకుంది.

నిర్మాణంలో ఉన్న భవనానికి, పురాతన గోడకు మధ్య భారీగా మట్టిని నింపిన బిల్డర్లు అది కింది వరకు చేరి బలంగా మారటానికి రోజూ నీళ్లు నింపుతున్నారు. నిజానికి పురాతన గోడ స్థానంలో బలమైన ప్రహరీ నిర్మించాల్సి ఉండగా అలా చేయలేదు. కనీసం మరమ్మతులకు ఉపక్రమించలేదు. కేవలం దాని ఎత్తును మాత్రం దాదాపు ఐదు అడుగుల మేర పెంచారు. గోడకు భవనం బేస్‌మెంట్‌కు మధ్య నింపిన మట్టిలోకి నీటిని పంపుతున్న నిర్మాణదారులు అధికమైన నీరు బయటకు రావడానికి రంధ్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో ఆ నీటిని పీల్చుకున్న మట్టి బరువు పెరి గింది. దీనికి తోడు మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న జల్లుల కారణంగా పురాతన గోడ సైతం పూర్తిగా నానిపోవడంతో మట్టి బరువును ఆపలేకపోయింది. దీంతో ఒక్కసారిగా కూలిపోయింది.

మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా
మృతుల పేర్లు కార్మికులుగా నమోదై ఉంటే మరణించిన వారికి రూ.2 లక్షలు, లేని పక్షంలో రూ.50 వేలు చొప్పున అందిస్తామని కార్మిక శాఖ డిప్యూటి కమీషనర్ సామ్రాట్ అశోక్ తెలిపారు. కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి, ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మల్కాజిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కన్వీనర్ జి.సూర్యనారాయణరెడ్డి, నాయకులు కుసుగుండ్ల కుసుమకుమార్‌రెడ్డి తదితరులు సంఘటన స్థలాన్ని సందర్శించారు.

అనుమతి ఉంది..
గోడకు అవతల నాలుగు బ్లాక్‌లతో అపార్ట్‌మెంట్ నిర్మాణానికి భూ యజమానులు ఖమర్‌జహార్ తలెయవర్, మరో ఏడుగురు అనుమతి పొందినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. సర్వేనెంబరు 357/1,3,4 లో 11,369.93 చ.మీ.ల విస్తీర్ణంలో సెల్లార్, స్టిల్ట్, ఐదంతస్తుల నివాసగృహాలకు అనుమతి పొందారన్నారు. అమెనిటీస్ బ్లాక్‌కూ అనుమతి పొందినట్లు తెలిపారు. పశ్చిమం వైపున జీ ప్లస్ 1 నిర్మాణాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు.

మృత్యుంజయులు ఈ చిన్నారులు
ముద్దులొలుకుతున్న ఈ చిన్నారుల పేర్లు అవినాష్ (7), అనూష అలియాస్ లిల్లీ (4). ఆరుగురిని కబళించిన దుర్ఘటన నుంచి కొన్ని గంటల పాటు నరకయాతన అనుభవించి మృత్యుంజయులై బయటపడ్డారు. రెస్క్యూ ఆపరేషన్‌లో ఉన్న సహాయక బృందాలకు మంగళవారం తెల్లవారుజామున 4.30 ప్రాంతంలో శిథిలాల కింద నుంచి మూలుగు వినిపించింది. మట్టిపెళ్లలు, రాళ్లు, ఇతర వస్తువులను జాగ్రత్తగా పక్కకు తప్పించిన అధికారులు ఉదయం 6 గంటల ప్రాంతంలో అనూషను బయటకు తీశారు.

ఆపై అవినాష్ కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్, సీఎస్‌ఎస్‌ఆర్ బృందాలు రంగంలోకి దిగాయి. అత్యాధునిక పరికరాల సాయంతో తొలుత అవినాష్‌కు ఆక్సిజన్, గ్లూకోజ్ అందించారు. 9 గంటల ప్రాంతంలో బాలుడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. చిన్నారులిద్దరికీ తీవ్రమైన గాయాలు కాకపోయినా షాక్‌లో ఉన్నట్లు వైద్యులు చెప్పారు. చిన్నారుల దుస్థితిని చూసి స్థానికులు, చిన్నారులు చదువుకుంటున్న పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు ఉద్వేగానికి గురై కంటతడి పెట్టారు.

మరిన్ని వార్తలు