అదనంగా పావుగంట ఇస్తున్నాం

4 Mar, 2017 03:45 IST|Sakshi
అదనంగా పావుగంట ఇస్తున్నాం

ఆ తర్వాతే నిమిషం నిబంధన అమలు: ఇంటర్మీడియెట్‌ బోర్డు

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ పరీక్షల విష యంలో విద్యార్థులకు నిర్ణీత సమయాని కంటే అదనంగా పావుగంట సమయం ఇస్తున్నామని, ఆ తర్వాతే నిమిషం నిబందనను అమలు చేస్తున్నామని ఇంటర్మీడియెట్‌ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థుల హాల్‌టికెట్లలోనే ఈ విషయాన్ని స్పష్టం చేశామని పేర్కొంది. విద్యార్థులు ఉదయం 8:30 గంటలకల్లా పరీక్షహాల్లో ఉండాలని హాల్‌టికెట్‌లో సూచించామని తెలిపింది. 8:45 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని స్పష్టంగా వెల్లడించామని, అయినా 9 గంటల వరకు విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతిస్తున్నామని వివరించింది.

హైటెక్‌ కాపీయింగ్‌ను నిరోధించేందుకు ఈ చర్యలు చేపట్టామని వెల్లడించింది. అంతకంటే ఎక్కువ సమయం ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. ఈ నిబంధనను 2014 నుంచి అమలు చేస్తున్నామని తెలిపింది. ఈ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించాలని పేర్కొంది. ఏటా పరీక్షల్లో 4 నుంచి 5 శాతం గైర్హాజరు ఉండటం సహజమేనని, అది నిమిషం ఆలస్యం నిబంధన వల్ల కాదని వివరించింది.
మూడు చోట్ల ఒకరి బదులుగా మరొకరు పరీక్షకు..

ఇంటర్మీడియెట్‌ పరీక్షల్లో భాగంగా శుక్రవారం జరిగిన ప్రథమ సంవత్సర ఇంగ్లిషు పేపరు–1 పరీక్షకు 27,877 మంది (5.38 శాతం) విద్యార్థులు గైర్హాజరు అయ్యారని బోర్డు వెల్లడించింది. 5,17,876 మంది విద్యార్థులకు గాను 4,89,999 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపింది. మూడు చోట్ల మాత్రం ఒకరి బదులుగా మరొకరు పరీక్షలకు హాజరై దొరికి పోయారని వివరించింది. వారిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది. మెదక్, వనపర్తి, నల్లగొండ, సూర్యాపేటల్లో బోర్డు పర్యవేక్షణ బృందం తనిఖీలు చేశాయని, ఈ సందర్భంగా ముగ్గురు దొరికిపోయారని పేర్కొంది. మరో 5 మంది విద్యార్థులపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు బుక్‌ చేసినట్లు వెల్లడించింది.

మరిన్ని వార్తలు