ఏరోస్పేస్‌ శిక్షణకు 25 మంది డిప్లొమా విద్యార్థుల ఎంపిక

18 Nov, 2023 05:30 IST|Sakshi
రామకృష్ణతో ఏరోస్పేస్‌ శిక్షణకు ఎంపికైన విద్యార్థులు

మురళీనగర్‌ (విశాఖ ఉత్తర): పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులు చేసిన ప్రతి విద్యార్థికి అత్యున్నత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ (డీడీ) డాక్టర్‌ ఎంఏవీ రామకృష్ణ చెప్పారు. ఏరోస్పేస్‌ రంగంలో పారిశ్రామిక శిక్షణకు విద్యార్థుల ఎంపిక ప్రక్రియను ఆయన ఆధ్వర్యంలో విశాఖ కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో శుక్రవారం నిర్వహించారు.

ఏరోస్పేస్‌ రంగంలో విశాఖ అభివృద్ధి చెందుతున్నందున ఇక్కడ నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీని ఎంపిక చేశామన్నారు. గ్లోబల్‌ ఏరోస్పేస్‌ కంపెనీ బోయింగ్, లెర్నింగ్‌ లింక్స్‌ ఫౌండేషన్‌ సహకారంతో మెకానికల్‌ డిప్లొమా విద్యార్థులకు 6 నెలల పారిశ్రామిక శిక్షణకు గాను రెండో బ్యాచ్‌ ఎంపిక ప్రక్రియ నిర్వహించినట్లు చెప్పారు. ఈ ప్రక్రియలో 134 మంది పాల్గొనగా రాత, మౌఖిక పరీక్ష ద్వారా 25 మందిని ఏరోస్పేస్‌లో శిక్షణకు ఎంపిక చేసినట్లు చెప్పారు.

వీరిలో 12 మంది బాలురు, 13 మంది బాలికలున్నట్లు చెప్పారు. వీరికి అచ్యుతాపురంలోని ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ కేంద్రంలో శిక్షణనిస్తారని, శిక్షణ కాలంలో బోయింగ్‌ కంపెనీ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌) కింద లెర్నింగ్‌ లింక్స్‌ ఫౌండేషన్‌కు నిధులు అందిస్తుందని తెలిపారు. లెర్నింగ్‌ లింక్స్‌ ఫౌండేషన్‌ సంస్థ ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌లో శిక్షణ తీసుకునే విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.35,000 కోర్సు ఫీజుతోపాటు నెలకు రూ.3,000 ఉపకార వేతనం చెల్లిస్తుందన్నారు.

మరిన్ని వార్తలు