భక్తురాలిగా నమ్మించి స్వామీజీకి టోకరా...

9 May, 2017 09:40 IST|Sakshi
ఆధ్యాత్మిక గురువుకే పంగనామాలు

హైదరాబాద్‌:  ఆధ్యాత్మిక గురువుకే పంగనామాలు పెట్టింది. తన మాయమాటలతో స్వామి వాహానాన్నే స్వాహా చేసింది.. అడిగితే.. అదిగో.. అల్లదిగో.. అంటూ కాలాన్ని వెళ్లదీసుకొచ్చింది.. అనుమానం వచ్చిన స్వామీజీ అసలు విషయం తెలుసుకొని అవాక్కయ్యారు.. హతవిధి... ఏమిటిది అనుకుంటూ పోలీసులను ఆశ్రయించారు.. భక్తురాలిగా నమ్మించి స్వామీజీ వద్ద ఉన్న ఇన్నోవా వాహనంతో ఉడాయించిన ఆ కిలాడీ లేడీ కోసం ఇప్పుడు జూబ్లీహిల్స్‌ పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.5లో నివసించే ఎ.వి.కృష్ణారావు అలియాస్‌ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి నివసిస్తుంటారు. ఆయన వద్దకు జె. అరుణారెడ్డి అనే మహిళ భక్తురాలిగా వస్తుండేది.

అలా మహర్షి స్వామిజీకి నమ్మకంగా మారింది. గత మార్చి 20న మహర్షికి చెందిన ఇన్నోవా వాహనం టీఎస్‌ 09ఏక్యూ టీ/ఆర్‌ 2001 వెనక్కి తీస్తుండగా వాహనం అనుకోకుండా ప్రమాదానికి గురైంది. దీంతో వాహనం స్వల్పంగా దెబ్బతింది. అరుణారెడ్డి వాహనాన్ని రెండు రోజుల్లో బాగు చేయిస్తానని చెప్పి మహర్షిని నమ్మించి తనతోపాటు తీసుకెళ్లింది. అలా తీసుకెళ్లిన ఆమె వాహనం రిపేర్‌ పేరుతో వాహనాన్ని తన వద్దనే ఉంచుకొంది. మహర్షి ఎన్నిసార్లు అడిగినా మాయమాటలతో బోల్తా కొట్టించింది. రోజుకో మాట చెప్పి నమ్మిస్తున్న అరుణారెడ్డి మాటలపై అనుమానం వచ్చిన మహర్షి అసలు విషయం ఆరా తీయాగా ఆమె వాహానాన్ని వేరే వాళ్లకి తాకట్టు పెట్టినట్లు తెలిసింది.

అరుణారెడ్డి కూడా ఆశ్రమానికి రాకుండా సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయడంతో అనుమానం వచ్చిన ఆయన జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిఇలా ఉండగా రెండు రోజుల క్రితం అరుణారెడ్డి మల్కాజ్‌గిరి పోలీస్‌ స్టేసన్‌లో మోసం కేసులో అరెస్ట్‌ అయినట్లు జూబ్లీహిల్స్‌ పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా నల్గొండలో, నారాయణగూడలో కూడా ఇలాంటి మోసం కేసులు ఆమెపై నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు పిటిషన్‌ వేసి ఆమెను అదుపులోకి తీసుకుంటామని జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రెడ్డి తెలిపారు.

అయితే మల్కాజీగిరి పోలీసులకంటే ముందుగానే జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు అందినా పోలీసుల అలసత్వం కారణంగా మాయ లేడి దర్జాగా తప్పించుకొంది. ఇక్కడ పోలీసుల ఆలస్యం వల్ల ఆమె మరో మోసం చేసేందుకు యత్నించింది. ఈ క్రమంలోనే మల్కాజీగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అరెస్ట్‌ కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు