రేవంత్‌పై తెలంగాణ సీఈవోకు ఫిర్యాదు.. బీఆర్‌ఎస్‌ వ్యతిరేక యాడ్స్‌పై కాంగ్రెస్‌ రియాక్షన్‌ ఇది

13 Nov, 2023 17:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంలో ఇవాళ రాజకీయ పార్టీలు పోటాపోటీ ఫిర్యాదు చేసుకున్నాయి. ఓవైపు నామినేషన్ల పరిశీలన కొనసాగుతున్న వేళ.. మరోవైపు ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.  

తొలుత సీఈవో వికాస్‌రాజ్‌ను బీఆర్‌ఎస్‌ లీగల్‌ టీం కలిసింది. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగిస్తున్నారని ఫిర్యాదు చేయడంతో పాటు.. బీఆర్‌ఎస్‌ను కించపరిచే విధంగా  కాంగ్రెస్ ఇస్తున్న యాడ్స్‌ను ఆపించాలని మరో ఫిర్యాదు ఇచ్చింది.  ఈ మేరకు సీఈవోకు కలిసిన అనంతరం బీఆర్‌ఎస్‌ లీగల్‌ టీం ప్రతినిధి సోమా భరత్ మీడియాతో మాట్లాడారు. 

‘‘పచ్చగా ఉన్న తెలంగాణ ను హింసాత్మకంగా చేసేందుకు ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోంది.టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హింసను ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.క్యాడర్ ను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారాయన. వారం రోజుల్లో దుబ్బాక, అచ్చంపేట ఘటనలు జరిగాయి. దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి ఇప్పటికీ సీరియస్గానే ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులపై దాడులు జరిగితే రేవంత్ రెడ్డి కనీసం మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు. పదేళ్లుగా బీఆర్‌ఎస్‌ పాలనలో ఎక్కడైనా ఘటనలు జరిగాయా?. ఇప్పుడు జరుగుతున్న ఘటనలు ఎవరి వల్ల జరుగుతున్నాయో ప్రజలు ఆలోచన చేయాలి. రేవంత్‌కు టీడీపీ తల్లిపార్టీ అయితే.. కాంగ్రెస్ అత్తపార్టీ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి టీడీపీ పార్టీ అంతర్గత ఒప్పందం కుదిరింది.  స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న రేవంత్ రెడ్డి భాష పద్ధతిగా ఉండాలి అని సోమా భరత్‌ అన్నారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ను ఎన్నికల ప్రచారం నుంచి తొలగించాలని ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ లీగల్‌ టీం సీఈవోకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. 

అలాగే.. కాంగ్రెస్‌ వాళ్లు ఎంసీఎంసీ Media certification Monitoring committee (MCMC) కమిటీకి చూపించిన ప్రకటనలు ఒకటి.. బయట ప్రచారం మాత్రం మరొకటి. ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్న అంశాలపై ఈసీ క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని సోమా భరత్‌ కోరారు.  సీఈవోకు చేసిన ఫిర్యాదు ఆధారంగా యాడ్స్‌ ఆపేయాలని కాంగ్రెస్‌కు నోటీసులు వెళ్లినట్లు తెలుస్తోంది. 

అలంపూర్‌ అభ్యర్థిపై కాంగ్రెస్‌ ఫిర్యాదు
తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు  ఎన్నిక సంఘం కార్యాలయానికి వెళ్లారు. అలంపూర్(జోగులాంబ గద్వాల్‌) బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయుడి అఫిడవిట్‌పై అభ్యంతరం(ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా విషయంలో స్పష్టత లేదని కాంగ్రెస్‌ ఆరోపణ) అంశంతో పాటు మరికొన్ని అంశాలపైనా కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది. 

యాడ్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్‌ఎస్‌ చేసిన ఫిర్యాదుపైనా ఏఐసీసీ అధికార ప్రతినిధి అజయ్ స్పందించారు. ‘‘సీఈవో ఆఫీస్ నుంచి కాంగ్రెస్ పార్టీవి నాలుగు వీడియో లు నిలిపివేయాలని నోటీస్ ఇచ్చింది. మేము ప్రచారం చేసే ప్రతి యాడ్ ఎంసీఎం అనుమతి తీసుకున్నాం. యాడ్ బంద్ చేయడానికి మాకు డైరెక్ట్ నోటీస్ రివ్వకుండా టీవీ ప్రచారం తరువాత సీఈవో నుంచి లేఖ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది పోలీసులు మా కాంగ్రెస్ అభ్యర్థులను, కార్యకర్తలకు బెదిరింపులకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో పోలీసులు బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పనిచేస్తున్నారు. మేం ఈసీఐ నిబంధనలు పాటిస్తున్నాం. మేము ఎంసీఎంసీకి ఇచ్చిన యాడ్స్.. టీవీలో కనిపిస్తున్న యాడ్ ఒకే చోట పెట్టి చూపించాలి’’ అని అజయ్‌ అన్నారు. 

ఇదే అంశంపై.. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ‘‘ కాంగ్రెస్ పార్టీ యాడ్స్‌ నిలిపివేయాలని ఇచ్చిన ఆదేశాలపై సీఈవోకు విజ్ఞప్తి లేఖను ఇచ్చాము. కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసే ప్రకటనల పై ఎదైనా అభ్యంతరకరంగా ఉంటే మాకు నోటీస్ ఇవ్వాలి. ప్రకటనల పై మాకు నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్ టివి ఛానెల్స్ కు ఆదేశాలు ఇవ్వడం పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. సీఈవో మళ్ళీ రివ్యూ చేస్తానని చెప్పారు.. అని తెలిపారు. 

సీఈవో ఆఫీస్‌కు కర్ణాటక, రాజ్య రైతు సంఘం సభ్యులు
కర్ణాటక, రాజ్య రైతు సంఘం సభ్యులు ఈ నెల 22వ తేదీన ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు అనుమతి ఇవ్వాలని సీఈఓ వికాస్ రాజ్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇవాళ ఆఫీస్‌కు వెళ్లి ఆయనకు విజ్ఞప్తి చేశారు.  దేశంలోని అన్ని జాతీయ పార్టీలు రైతులకు బోగస్ హామీ ఇస్తునందుకు నిరసనగానే ఈ  ధర్నా చేపడుతున్నట్లు  రాష్ట్ర అధ్యక్షుడు కొడిహలి చంద్రశేఖర్ చెబుతున్నారు. 

‘‘దేశంలో ఉన్న జాతీయ పార్టీలు రైతులచేత తిరస్కరించబడ్డాయి. రైతులకు మద్దతు ధర కల్పించడంలో రెండు జాతీయ పార్టీలు విఫలం అయ్యాయి. రైతులకు ఇచ్చే హామీలు జాతీయ పార్టీలు అమలు చేయడం లేదు. ఇప్పటికే కర్ణాటకలో రైతులు జాతీయ పార్టీల వల్ల మోసపోయారు. తెలంగాణ ప్రజలు మోసపోవద్దని ఇక్కడి రైతులకు అవగాహన కల్పించడానికి ధర్నా చేస్తాం. ఈ నెల 22 ఇందిరా పార్క్ వద్ద ధర్నా కోసం సీఈవో, హైదరాబాద్ కమిషనర్‌ను అనుమతి కోరాం’’ అని తెలిపారాయన. 

వీటితో పాటు మరికొన్ని స్థానాల్లో అభ్యర్థుల విషయంలోనూ ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు