-

దళితుల అభ్యున్నతికి బొజ్జా కృషి

26 Sep, 2016 00:46 IST|Sakshi
దళితుల అభ్యున్నతికి బొజ్జా కృషి

తారకం స్మారక సభలో కేంద్ర మంత్రి రాందాస్ వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: దళితుల అభ్యున్నతి కోసం పోరాడిన యోధుడు బొజ్జా తారకం అని కేంద్ర సాంఘిక, న్యాయ, సాధికారతల మంత్రి రాందాస్ అథవాలే పేర్కొన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన బొజ్జా స్మారక సభకు హాజరైన ఆయన తారకం చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రాందాస్ మాట్లాడుతూ.. దళిత పోరాట అగ్రశ్రేణి యోధుల్లో బొజ్జా ఒకరని, సామాజిక స్పృహ కలిగిన రచనలు చేసి, ప్రజలను జాగృతం చేశారని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో తనదైన ముద్ర వేసుకున్న న్యాయవాదిగా ఖ్యాతి గడించారన్నారు.

గొంతులేని వారందరికీ బొజ్జా తారకం గొంతుకగా నిలిచారని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తాను ఈ స్థాయికి చేరుకోవటానికి కారణం బొజ్జా తారకమేనన్నారు. బొజ్జా తారకం ఏదీ చేసినా సమాజ హితం కోసమే చేస్తారని.. ఆయన జీవితం అంతా పోరాటానికే సరిపోయిందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. వ్యక్తిగా వచ్చి శక్తిగా వెళ్లిన మహానుభావుడు బొజ్జా అని జస్టిస్ చంద్రయ్య పేర్కొన్నారు. బొజ్జాను తాము ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్‌గా పిలుస్తామని  విరసం నేత వరవరరావు చెప్పారు. అలుపెరగని పౌరహక్కుల ఉద్యమ సేనాని, రచయిత, మేధావి, దళిత రాజకీయ వేత్త బొజ్జా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు.

రాజకీయ పరిణామాలపై బొజ్జా స్పష్టమైన అవగాహన కలిగి ఉండేవారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నేటి తరానికి స్ఫూర్తి ప్రధాత బొజ్జా అని మాజీ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బొజ్జా తారకం కుమారుడు, హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా,  తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్ సి. ప్రభాకర్, జస్టిస్ రామస్వామి, జస్టిస్ సురేశ్ కుమార్, ఐఏఎస్‌లు గోపాలరావు, దాసరి శ్రీనివాస్, దళిత నాయకులు జేబీ రాజు, సి. ప్రజ్ఞ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు