రూ.7 కోట్ల యువరాజుకి జ్వరమొచ్చింది

13 Nov, 2015 20:38 IST|Sakshi
రూ.7 కోట్ల యువరాజుకి జ్వరమొచ్చింది

హైదరాబాద్ : సదర్ సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన 'యువరాజ్' దున్నపోతుకు జ్వరమొచ్చింది. మార్కెట్‌లో ఈ దున్నపోతు విలువ రూ.7 కోట్లు. హైదరాబాద్ నగరంలోని యాదవులందరూ కలసి చేసుకొనే సదర్ పండుగలో దున్నపోతుల ప్రదర్శన నిమిత్తం...  హర్యానాలోని కురుక్షేత్ర నుంచి ‘యువరాజ్’ను రెండు రోజుల కిందట నగరానికి తరలించారు. ఇందుకు దాదాపు రూ.3 లక్షల వరకు ఖర్చు, 6 రోజుల సమయం పట్టింది.


1600 కిలోల బరువు, 6 అడుగుల ఎత్తు... 14 అడుగుల పొడవు... అచ్చమైన రాచఠీవీని ఒలకబోసే ఈ యువరాజుకు ఆకలేస్తే రోజుకు 15 కేజీల యాపిల్స్, బాదం పిస్తాలు... కాదంటే కాజూలు తినడమే. హర్యానా ‘యువరాజ్’కు భారత్‌లోనే కాదు... విదేశాల్లోనూ బాగా ప్రసిద్ధి. 2007లో పుట్టిన ఈ దున్న ఇప్పటి వరకు ఎన్నో దూడలకు జన్మనిచ్చింది.

 

దీని వీర్యం కోసం యూరోపియన్ దేశాల్లో ఎంతో డిమాండ్. ఈ దున్నకు రోజూ గడ్డి, దాణాతో పాటు పాలు, బాదం, పిస్తా, కాజు, బెల్లం, క్యారెట్ వంటి ఖరీదైన ఆహారం అందజేస్తామని దాని యజమాని కరమ్‌వీర్‌సింగ్ తెలిపారు. ఇందుకు రోజుకు రూ.5 వేలు ఖర్చవుతుందన్నారు. ఇప్పటి వరకు పంజాబ్, హర్యానాలతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో నిర్వహించిన అఖిల భారత పోటీల్లో గెలిచి 12 సార్లు చాంపియన్‌గా నిలిచింది.

మరిన్ని వార్తలు