ODI WC 2023 IND Vs AUS: నువ్వెందుకు ఉన్నట్లు? అయినా రాహుల్‌ను ఎందుకు ఆడించడం లేదు.. ఇకనైనా: యువీ అసహనం

9 Oct, 2023 18:48 IST|Sakshi

ICC WC 2023- Ind vs Aus- Shreyas Iyer Failure: టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఆట తీరుపై భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. జట్టు ఒత్తిడిలో కూరుకుపోయిన వేళ నాలుగో స్థానంలో వచ్చి.. నువ్వేం చేశావంటూ మండిపడ్డాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌ నంబర్‌ 4లో కేఎల్‌ రాహుల్‌ను కాదని అయ్యర్‌ను ఎందుకు ఆడిస్తున్నారో అర్థం కావడం లేదంటూ అసహనం వ్యక్తం చేశాడు.

A post shared by ICC (@icc)

కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా భారత జట్టు తమ ఆరంభ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడింది. చెన్నైలోని చెపాక్‌ వేదికగా ఇరు జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడిన టీమిండియా తొలుత బౌలింగ్‌ చేసింది. 

199 పరుగులకే ఆసీస్‌ కుప్పకూలినా
పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా మూడో ఓవర్లోనే వికెట్‌ తీసి శుభారంభం అందించాడు. ఇక స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్‌పై రవీంద్ర జడేజా అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్‌ యాదవ్‌కు రెండు, రవిచంద్రన్‌ అశ్విన్‌కు ఒక వికెట్‌ దక్కాయి. పేసర్లలో బుమ్రాకు రెండు, సిరాజ్‌, హార్దిక్‌ పాండ్యా ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

భారత బౌలర్ల విజృంభణ నేపథ్యంలో ఆస్ట్రేలియా 199 పరుగులకే ఆలౌట్‌ అయింది. అయితే, స్వల్ప లక్ష్యమే కదా అని సంబరపడుతున్న తరుణంలో ఆదిలోనే టీమిండియాకు భారీ షాకులు తగిలాయి. ఓపెనర్లలో ఇషాన్‌ కిషన్‌ గోల్డెన్‌ డకౌట్‌ కాగా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా సున్నాకే అవుటయ్యాడు.

అయ్యర్‌ అనవసరంగా..
ఇలాంటి తరుణంలో వన్‌డౌన్‌లో ఉన్న విరాట్‌ కోహ్లికి జతైన శ్రేయస్‌ అయ్యర్‌ ఆచితూచి ఆడాల్సింది పోయి నిర్లక్ష్యంగా వికెట్‌ పారేసుకున్నాడు. హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో వార్నర్‌కు క్యాచ్‌ ఇచ్చి పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. 

కోహ్లి, రాహుల్‌  పట్టుదలగా నిలబడి
టీమిండియా స్కోరు 2/3 ఉన్న వేళ.. కోహ్లి 85 పరుగులతో అదరగొట్టగా.. కేఎల్‌ రాహుల్‌ 97 పరుగులతో దుమ్ములేపాడు. ఐదోస్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ కర్ణాటక బ్యాటర్‌ ఆఖరి వరకు అజేయంగా నిలిచి సిక్సర్‌తో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.

అయ్యర్‌ తొందరపాటుపై యువీ అసహనం
ఈ నేపథ్యంలో శ్రేయస్‌ అయ్యర్‌ అవుటైన తీరుపై స్పందించిన మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌.. ‘‘నంబర్‌ 4 బ్యాటర్‌ బాధ్యతగా ఆడాలి. ఒత్తిడిని తను స్వీకరించాలి!! జట్టు కష్టాల్లో కూరుకుపోయి ఇన్నింగ్స్‌ పునర్నిర్మించే క్రమంలో శ్రేయస్‌ అయ్యర్‌ ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది.

రాహుల్‌ను ఎందుకు ఆడించడం లేదు
అయినా ఇప్పటికీ కేఎల్‌ రాహుల్‌ను నంబర్‌ 4లో ఎందుకు బ్యాటింగ్‌కు పంపడం లేదో అర్థం కావడం లేదు! పాకిస్తాన్‌ మీద 100 సాధించాడు! ఇప్పుడిలా!’’ అంటూ అయ్యర్‌ను విమర్శిస్తూ.. రాహుల్‌ను ప్రశంసించాడు. కాగా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కీలక స్థానమైన నాలుగో స్థానంలో ఆడి యవరాజ్‌ సింగ్‌ టీమిండియాకు చిరస్మరణీయ విజయాలు అందించిన విషయం తెలిసిందే.

యువీ వారసుడు అతడే
అయితే, ఇంతవరకు ఆ స్థానంలో యువీ స్థాయిలో రాణించగల ఆటగాడు లేడనే చెప్పాలి. ప్రస్తుత ఫామ్‌ దృష్ట్యా కేఎల్‌ రాహుల్‌.. యువీకి సరైన వారసుడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కింగ్‌ క్యాచ్‌ వదిలేస్తే అంతే మరి!
ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో మ్యాచ్‌లో హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను మిచెల్‌ మార్ష్‌ వదిలేయడాన్ని యువీ ప్రస్తావిస్తూ.. ‘‘భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కింగ్‌ క్యాచ్‌ విడిచిపెడితే.. అతడు మీ నుంచి గేమ్‌ను లాగేసుకుంటాడు కదా! అంటూ కోహ్లిపై యువీ ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

చదవండి: ODI WC 2023 Ind Vs Afg: ఇంకా చెన్నైలోనే.. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌కు అతడు దూరం: బీసీసీఐ ప్రకటన

A post shared by ICC (@icc)

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు