చైనాలో భూకంపం.. 11 మంది మృతి.. 122 మందికి గాయాలు

18 Jun, 2019 08:48 IST|Sakshi

చెంగ్ధూ : చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదు అయ్యింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా 122 మంది తీవ్రంగా గాయపడ్డారని అక్కడి మీడియా పేర్కొంది. విపత్తు సంభవించిన ప్రాంతానికి చేరుకున్న సహాయక సిబ్బంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సోమవారం అర్థరాత్రే సుమారు 30 నిమిషాల పాటు భూమి కంపించగా... సిచువాన్‌ రాజధాని చెంగ్దూ, చాంగ్‌నింగ్‌ నగరాలు షేక్‌ అయ్యాయి. దీంతో జనాలంతా రోడ్లపైకి పరుగులు తీశారు. వీటికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.  భూమి మొత్తం రెండు సార్లు కంపించగా.. ఒకసారి 5.9, మరో 5.2 తీవ్రతగా రిక్టర్‌ స్కేలుపై నమోదైందని, చాంగ్‌నింగ్‌ సమీపంలోని 10 కిలో మీటర్ల దూరంలో ఈ భూకంపం కేంద్రీకృతమై ఉందని అమెరికా జియోలాజికల్‌ సర్వే విభాగం పేర్కొంది. సిచువాన్ ప్రావిన్స్‌లో తరచుగా భూప్రకంపనలు సంభవిస్తాయి. 2008 మేలో వచ్చిన భూకంపంతో సుమారు 70వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

మరిన్ని వార్తలు