‘95% ప్లాస్టిక్‌ వ్యర్థాలకు పది నదులే కారణం’

19 Oct, 2017 03:20 IST|Sakshi

బెర్లిన్‌: ప్రపంచవ్యాప్తంగా కేవలం పది నదుల ద్వారానే 88–95 శాతం ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రాల్లో కలుస్తున్నాయని తేలింది. ఈ జాబితాలో గంగా, సింధు సహా 8 నదులు ఆసియాలో ఉండగా, మరో రెండు నదులు ఆఫ్రికా ఖండంలో ప్రవహిస్తున్నాయి. సరైన వ్యర్థాల నిర్వహణ పద్ధతులు పాటించకపోవడంతో ఏటా 5 ట్రిలియన్‌ పౌండ్ల ప్లాస్టిక్‌ సముద్రంలో చేరుతోందని ఈ పరిశోధనలో పాల్గొన్న డా.క్రిస్టియన్‌ ష్మిత్‌ తెలిపారు.

తమ పరిశోధనలో భాగంగా 57 నదుల్లో, 79 చోట్ల నమూనాలు సేకరించామన్నారు. 5 మి.మీ కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ వ్యర్థాలను సముద్రాల్లో కనుగొన్నామనీ, ఇది అక్కడి పర్యావరణానికి చాలా ప్రమాదకరమన్నారు. వీటిని నీటి నుంచి తొలగించడం కూడా అసాధ్యమన్నారు. ఇదే పరిమాణంలో వ్యర్థాలు చేరుతూపోతే 2050 నాటికి సముద్రాల్లో చేపల కంటే ప్లాస్టిక్‌ వ్యర్థాలే ఎక్కువగా ఉంటాయని చెప్పారు.

ఈ వ్యర్థాల వల్ల 10 లక్షల సముద్రపు పక్షులు, లక్ష క్షీరదాలతో పాటు అసంఖ్యాకంగా చేపలు మృత్యువాత పడుతున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా సముద్రాల్లో కలుస్తున్న ప్లాస్టిక్‌లో చైనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, శ్రీలంకల వాటాయే 50 శాతానికిపైగా ఉంటుందన్నారు. జాబితాలోని తొలి 20 స్థానా ల్లో అమెరికా (1%) కూడా ఉందన్నారు. మొత్తం ప్లాస్టిక్‌ వ్యర్థాల్లో 28% చైనా నుంచే సముద్రాల్లోకి చేరుతున్నాయన్నారు.

వ్యర్థాలను చేరవేస్తున్న తొలి 10 నదులు:
యాంగ్జీ, సింధు, యెల్లో రివర్, హైహీ (ఆసియా); నైలు (ఆఫ్రికా); గంగా, పెరల్, అముర్‌ (ఆసియా); నైజర్‌ (ఆఫ్రికా), మెకాంగ్‌ (ఆసియా). 

మరిన్ని వార్తలు