బ్రిటన్‌ హోం మంత్రి బ్రేవర్‌మన్‌ను తొలగించిన రిషి సునాక్‌

13 Nov, 2023 16:08 IST|Sakshi

లండన్: బ్రిటిష్ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్‌మన్‌కు ఉద్వాసన పలికింది రిషి సునాక్‌ ప్రభుత్వం. పాలస్తీనా అనుకూల ఆందోళనలను అణిచివేయడంలో లండన్ పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. బ్రేవర్‌మన్‌ వ్యాఖ్యలపై గత కొద్ది రోజులుగా వివాదం నడుస్తున్న నేపథ్యంలో సునాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేయాల్సిందిగా బ్రేవర్‌మన్‌ను సునాక్ అడిగినట్లు రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. సునాక్ ఆదేశాలకు ఆమె అంగీకరించినట్లు రాయిటర్స్‌లో కథనం వెలువడింది. 

గాజాలో ఇజ్రాయెల్ కాల్పుల విరమణ చేపట్టాలని బ్రిటన్ వేదికగా ఆందోళనకారులు గత కొద్ది రోజులుగా నిరసనలు చేపడుతున్నారు. ఈ నిరసనలకు అడ్డుకట్ట వేయడంలో అధికారులు విఫలమైతున్నారని ప్రధాని సునాక్ అంతరంగిక మంత్రి బ్రేవర్‌మన్ మండిపడ్డారు. ఆందోళనల పట్ల అధికారులు కూడా సానుకూల వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని సునాక్ అనుమతి లేకుండానే ఈ అంశంపై ఓ కథనం కూడా ప్రచురించారు. 

ఈ అంశం గత కొద్ది రోజులుగా బ్రిటన్‌లో వివాదానికి దారి తీసింది. ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆమెను పదవి నుంచి తొలగించాలని నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. బ్రేవర్‌మన్‌ను తొలగించాల్సిందిగా సునాక్‌పై ఒత్తిడి చేశారు. ఈ నేపథ్యంలో ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించారు.

ఇలా ఉంటే.. బ్రిటన్‌ కేబినెట్‌లో సుయెల్లా బ్రేవర్మన్‌ సీనియర్‌ మంత్రి. గతంలో మాజీ ప్రధాని లిజ్‌ ట్రస్‌ మంత్రివర్గంలో కూడా ఆమె పనిచేశారు. అప్పట్లో లిజ్‌ ట్రస్‌ ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటోందని విమర్శించారు. అదే సమయంలో మైగ్రేషన్‌ అంశంపై అధికారిక పత్రాలను వ్యక్తిగత మెయిల్‌ ద్వారా షేర్ చేసినందుకు బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం రిషి సునాక్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక.. ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇంటీరియర్‌ మినిస్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఆమె ప్రచురించిన కథనం వివాదాస్పదం కావడంతో మరోసారి పదవి కోల్పోయారు. గతంలో ఆమె వలసదారులపై చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపాయి.

మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్‌కు చోటు
బ్రేవర్‌మన్ స్థానంలో విదేశాంగ మంత్రి జేమ్స్ క్లీవర్లీని బ్రిటన్‌  కొత్త హోం మంత్రిగా సునాక్ ప్రభుత్వం నియమించింది. మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్‌ను బ్రిటన్ తదుపరి విదేశాంగ మంత్రిగా ఎంపిక చేసింది. త్వరలో వారు అధికారికంగా పదవులు చేపట్టనున్నారు. కామెరూన్ 2010 నుంచి 2016 వరకు ప్రధానిగా పనిచేశారు.  

ఇదీ చదవండి: Jaishankar Gift To Rishi Sunak: బ్రిటీష్‌ ప్రధానికి భారత్‌ దీపావళి కానుక


 

మరిన్ని వార్తలు