వాడేసిన ప్లాస్టిక్‌తో వండర్స్‌

7 Nov, 2023 00:25 IST|Sakshi
రీసైకిల్‌ ప్లాస్టిక్‌ బ్యాగ్‌తో రాజీ బెన్‌

సక్సెస్‌ స్టోరీ

మనింట్లో చాలా ప్లాస్టిక్‌ కవర్స్‌ పోగవుతాయి. వాటిని చెత్తలో పడేస్తాము. అవి ఎప్పటికీ మట్టిలో కలవక అలాగే కాలుష్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. కాని ఈ ప్లాస్టిక్‌ కవర్లనే రాజిబెన్‌ దారాలుగా చేసి బ్యాగులు అల్లుతుంది. బుట్టలు చేస్తుంది. పర్సులు చేస్తుంది. డోర్‌మ్యాట్లు సరేసరి. అందుకే ఆమెకు చాలా గుర్తింపు వచ్చింది. ఆమె వల్ల ఎందరికో ఉపాధి కలుగుతోంది. కొత్త ఆలోచన చేసిన వారే విజేతలు.

గుజరాత్‌ కచ్‌ ప్రాంతంలోని కోటె అనే చిన్న పల్లెలో ఏమీ చదువుకోని అమ్మాయి – రాజి బెన్‌ పెరిగి పెద్దదయ్యి లండన్‌ వెళ్లి అక్కడ పెద్దవాళ్లతో తాను చేసిన కృషిని వివరించింది. ఆమె తన జీవితంలో ఇంత పెద్ద ప్రయాణం చేసి, గుర్తింపు పొందేలా చేసింది ఏమిటో తెలుసా?

వృధా ప్లాసిక్‌. వాడేసిన ప్లాస్టిక్‌
రోడ్ల మీద, ఇళ్ల డస్ట్‌బిన్‌లలో, చెత్త కుప్పల మీద అందరూ ప్లాస్టిక్‌ కవర్లను, రేపర్లను పారేస్తారు. వాటిని ఏం చేయాలో ఎవరికీ ఏమీ తోచదు. అవి తొందరగా మట్టిలో కలిసిపోవు. కాని రాజిబెన్‌ వాటిని ఉపయోగంలోకి తెచ్చింది. వాటిని సేకరించి, కట్‌ చేసి పీలికలుగా మార్చి, కలిపి నేసి అందమైన వస్తువులు తయారు చేసింది. బ్యాగులు, సంచులు, పర్సులు... వాటి మన్నిక కూడా ఎక్కువ.

ఎలా చేస్తారు?
వాడేసిన ప్లాస్టిక్‌ క్యారీబ్యాగ్స్‌ను సేకరించి సర్ఫ్‌ నీళ్లతో కడుగుతారు. ఆ తర్వాత వాటిలోని మలినాలు పోవడానికి వేడి నీళ్లలో నానబెడతారు. తర్వాత రెండు రోజులు ఎండలో ఆరబెడతారు. ప్లాస్టిక్‌ మందంగా ఉంటే అర ఇంచ్‌ వెడల్పు రిబ్బన్‌లుగా; పలుచగా ఉంటే ముప్పావు ఇంచ్‌ రిబ్బన్‌లుగా కట్‌ చేస్తారు.

ఈ ముక్కలను నాణ్యమైన జిగురుతో అంటించి పొడవైన ఉండగా మారుస్తారు. అంటే మగ్గం మీద నేయడానికి దారం బదులు ఈ ప్లాస్టిక్‌ ఉండనే ఉపయోగిస్తారు. ఈ ప్లాస్టిక్‌ దారాలతో నేస్తే దళసరి వస్త్రం తయారవుతుంది. దానిని  కట్‌ చేసుకుని రకరకాల వస్తువులుగా చేతి నైపుణ్యంతో తీర్చిదిద్దుతారు. హ్యాండ్‌ బ్యాగ్‌లు, కూరగాయల బ్యాగ్‌లు, ఫోన్‌ బాక్సులు, పర్సులు.. ఇవన్నీ చాలా అందంగా ఉంటాయి. మన్నికతో ఉంటాయి.

ఎలా వచ్చింది ఐడియా?
రాజి బెన్‌ నేత కుటుంబంలో పుట్టింది. అయితే తండ్రికి నేత మీద విసుగుపుట్టి వ్యవసాయం చేసేవాడు. అదీగాక ఆడపిల్లలు మగ్గం మీద కూచోవడం నిషిద్ధం. కాని రాజి బెన్‌కి మగ్గం మీద పని చేయాలని 12 ఏళ్ల వయసు నుంచే ఉండేది. అందుకని మేనమామ కొడుకు దగ్గర రహస్యంగా మగ్గం పని నేర్చుకుంది. 14 ఏళ్లు వచ్చేసరికి మగ్గం పనిలో ఎక్స్‌పర్ట్‌గా మారింది. అయితే ఆమెకు పుట్టింటిలో కాని మెట్టినింటిలో గాని మగ్గం మీద కూచునే అవకాశమే రాలేదు.

ఏడేళ్లు కాపురం చేశాక భర్త హటాత్తుగా మరణించడంతో రాజి బెన్‌ ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాల్సి వచ్చింది ముగ్గురు పిల్లల కోసం. కచ్‌లో ఒక ఎన్‌.జి.ఓ ఉంటే అక్కడ మగ్గం పని ఖాళీ ఉందని తెలిస్తే వెళ్లి చేరింది. అందమైన వస్త్రాలు అల్లి వాటిని ఆకర్షణీయమైన వస్తువులుగా తీర్చిదిద్దే స్థానిక కళలో ఆమె ప్రావీణ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. ఎన్‌.జి.ఓ వారు ఆమె చేసిన ఉత్పత్తులతో ఎగ్జిబిషన్‌ సేల్‌ నిర్వహించేవారు.

2012లో జరిగిన ఎగ్జిబిషన్‌లో ఒక విదేశీ డిజైనర్‌ ప్లాస్టిక్‌ను రీసైకిల్‌ చేసి తయారు చేసిన బ్యాగ్‌ను చూపించి ‘ఇలాంటిది తయారు చేయగలవా?’ అని అడిగాడు. అది ఎలా తయారయ్యిందో అర్థమయ్యాక రాజి బెన్‌కు నాలుగు రోజులు కూడా పట్టలేదు అలాంటి బ్యాగులు తయారు చేయడానికి. ఆ డిజైనర్‌ వాటిని చూసి సంతృప్తిగా కొనుక్కుని వెళ్లాడు. మరికొన్ని బ్యాగులు జనం క్షణాల్లో ఎగరేసుకుపోయారు. అప్పటి నుంచి వేస్ట్‌ ప్లాస్టిక్‌ నుంచి రాజి బెన్‌ హస్తకళా ఉత్పత్తులను తయారు చేస్తోంది.

స్వచ్ఛ్‌ సుజల్‌ శక్తి సమ్మాన్‌
రాజి బెన్‌ ఖ్యాతి ఎంత దూరం వెళ్లిందంటే అమృత మహోత్సవం సందర్భంగా ‘స్వచ్ఛ్‌ సుజల్‌ శక్తి సమ్మాన్‌’ పురస్కారం ఆమెకు ప్రకటించారు. అలాగే యూరప్‌ దేశాల నుంచి ఆమె ఉత్పత్తులకు ఆర్డర్లు వస్తున్నాయి. ‘ప్లాస్టిక్‌ పీడ విరగడ అవ్వాలంటే దానిని ఎన్ని విధాలుగా రీసైకిల్‌ చేయవచ్చో అన్ని విధాలుగా చేయాలి.

రాజి బెన్‌ కొత్త తరాన్ని తనతో కలుపుకుంటే ఆమె ఉత్పత్తులు చాలా దూరం వెళ్లడమే కాక పర్యావరణానికి మేలు కూడా జరుగుతుంది’ అని విదేశీ ఎంట్రప్రెన్యూర్లు అంటున్నారు. రాజి బెన్‌ ప్రస్తుతం 90 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. 2018 నుంచి సొంత సంస్థ పెట్టుకోవడంతో దాని టర్నోవర్‌ ఇప్పుడు సంవత్సరానికి 10 లక్షలు దాటిపోయింది. ఆమె గెలుపు గాథ మరింత విస్తరించాలని కావాలని కోరుకుందాం.

మరిన్ని వార్తలు