అంతరిక్షంలో అమెరికా రహస్య ప్రయోగం

21 May, 2015 06:01 IST|Sakshi
అంతరిక్షంలో అమెరికా రహస్య ప్రయోగం

నింగికెగసిన ఎక్స్-37బీ మానవ రహిత అంతరిక్ష విమానం
 
వాషింగ్టన్: అమెరికా సైనిక విభాగం అంతరిక్షంలో అత్యంత రహస్య ప్రయోగం ఒకటి చేస్తోంది. ఎక్స్-37బీ అనే మానవ రహిత అంతరిక్ష విమానం ద్వారా గత ఐదేళ్లుగా దీన్ని కొనసాగిస్తోంది. ఇప్పటికే మూడుసార్లు నింగిలోకి వెళ్లిన ఈ విమానాన్ని భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి  నాలుగోసారి అంతరిక్షంలోకి పంపించారు. మొదటి మూడుసార్ల తరహాలోనే.. ఈసారీ ఈ విమానంలో ఏమున్నాయనేది ప్రపంచానికి తెలియదు. అత్యంత రహస్యంగా చేస్తున్న ఈ ప్రయోగం విశేషాలివీ...

ఎక్స్-37బీ మానవ రహిత అంతరిక్ష విమానాన్ని నాసా తయారు చేసింది. దీని పొడవు 29 అడుగులు. ఎత్తు 9.6 అడుగులు. బరువు  5,000 కిలోలు. డ్రోన్‌ల తరహాలో దీనిని పూర్తిగా కంప్యూటర్ల ద్వారా నియంత్రిస్తారు.  నాసా పాత షటిల్‌ల తరహాలోనే దీనిని కూడా.. భూమి చుట్టూ కక్ష్యలో తిరిగి ఆ తర్వాత భూమికి తిరిగి చేరేలా రూపొందించారు. భూమి పైన ఆకాశంలో 177 కిలోమీటర్ల నుంచి 800 కిలోమీటర్ల మధ్య ఇది తిరుగుతూ ఉంటుంది.  భూమికి తిరిగివచ్చేటపుడు మామూలు విమానం మాదిరి రన్‌వేపై దిగుతుంది.

ఇంతకుముందు ఎన్నిసార్లు వెళ్లొచ్చింది?
అమెరికాలోని కేప్ కేనెవరాల్ నుంచి.. 206 అడుగుల అట్లాస్-5 రాకెట్ ద్వారా ఈ అంతరిక్ష విమానాన్ని నింగిలోకి పంపారు. ఇంతకుముందు మూడుసార్లు కూడా కేప్ కేనెవరాల్ వైమానిక కేంద్రం నుంచే దీనిని రాకెట్ల ద్వారా పంపించారు. మొదట 2010 ఏప్రిల్‌లో నింగిలోకి పంపారు. 225 రోజుల తర్వాత అదే ఏడాది డిసెంబర్‌లో తిరిగివచ్చింది. రెండోసారి.. 2011 మార్చిలో పంపారు. అప్పుడు 469 రోజుల తర్వాత 2012 జూన్‌లో భూమికి తిరిగివచ్చింది. మూడోసారి 675 రోజుల పాటు అంతరిక్షంలో తిరుగాడిన ఈ విమానం.. గత అక్టోబర్‌లో నేలకు తిరిగివచ్చింది. ఇప్పుడు ఎంత కాలం కొనసాగుతుందన్న అంశంపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.

ఇందులో ఏం తీసుకెళ్లవచ్చు?
ఇది మనుషులను తీసుకెళ్లగలిగేంత పెద్దది కాదు. కానీ.. ఇందులో ఒక ఉపగ్రహాన్ని తీసుకెళ్లేందుకు సరిపోయేంత- ఉదాహరణకు చిన్నపాటి లారీ సైజు -స్థలం ప్రత్యేకంగా ఉంది. ఇందులో ఎటువంటి పరికరాలు లేదా వస్తువులను ఉంచి పంపిస్తున్నారనేది రహస్యం. ‘‘ఎక్స్-37బీ నాలుగో మిషన్‌లో ప్రయోగాత్మక చోదక వ్యవస్థ (ప్రొపెల్లింగ్ సిస్టమ్)ను పరిశీలిస్తున్నాం’’ అని వైమానిక దళ అధికార ప్రతినిధి ఇటీవల వెల్లడించారు.
 
నిఘా పరిజ్ఞానాన్ని పరీక్షిస్తున్నారా?
అమెరికా నిఘా సామర్థ్యాలను  పెంపొందించటం కోసం ఉద్దేశించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు ఈ విమానాన్ని వాడే అవకాశముందని.. సైనిక రహస్యాల నిపుణుడు ఒకరు పేర్కొన్నారు. రహస్యనిఘా ఉపగ్రహాలను నింగిలో అమర్చేందుకు దీనిని వాడుతున్నరన్న వాదనా ఉంది. విదేశీ ఉపగ్రహాలను  ధ్వంసం చేసేందుకు దీనిని వినియోగిస్తున్నారని, ఇది అంతరిక్షం నుంచి బాంబులు వేయగలదని వదంతులు వస్తున్నా.. వాటికి ప్రాతిపదిక లేదని నిపుణులు కొట్టిపారేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు