బ్యాటరీ-ఫ్రీ పరికరాలు.. రేడియో తరంగాలతో పనిచేస్తాయి..

6 Aug, 2014 03:46 IST|Sakshi
బ్యాటరీ-ఫ్రీ పరికరాలు.. రేడియో తరంగాలతో పనిచేస్తాయి..

 టెక్నాలజీ మాయ వల్ల ఇంట్లోని అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలనూ ఇంటర్నెట్‌కు అనుసంధానం చేసుకునేందుకు ఇప్పుడు వీలు అవుతోంది. కానీ వీటన్నింటినీ ఇంటర్నెట్‌కు అనుసంధానం చేసేందుకు అమర్చే పరికరాలకూ బ్యాటరీలను ఉపయోగించాల్సి రావడం ప్రస్తుతం ఓ పెద్ద ప్రతిబంధకం. అందుకే అసలు బ్యాటరీ అవసరమే లేకుండా.. రేడియో తరంగాలనే విద్యుత్‌గా వాడుకుంటూ.. వాటి ద్వారానే వై-ఫై పరికరానికి, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లకు అనుసంధానమై పనిచేసే వినూత్న ‘బ్యాటరీ-ఫ్రీ డివైస్’లను భారత సంతతి ఇంజనీర్ శ్యామ్ గొల్లకోట నేతృత్వంలోని బృందం ఆవిష్కరించింది.

యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన శ్యామ్ ఆవిష్కరించిన ‘వై-ఫై బ్యాక్‌స్కాటర్’ అనే ఈ టెక్నాలజీ ప్రస్తుతం వై-ఫై పరికరాలకు రెండు మీటర్ల దూరంలోపు మాత్రమే,  సెకనుకు ఒక కిలోబిట్ వేగంతో పనిచేస్తుంది. దీనిని 20 మీటర్లకు పెంచేందుకు వీరు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి టెక్నాలజీ రావడం ఇదే తొలిసారని చెబుతున్నారు. వీరి పరిశోధన వివరాలను షికాగోలో ఈ నెలలోనే జరిగే ‘అసోసియేషన్ ఫర్ కంప్యూటింగ్ మెషినరీస్ స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ కమ్యూనికేషన్స్’ సదస్సులో సమర్పించనున్నారు.
 

మరిన్ని వార్తలు