మగబిడ్డకు జన్మనిచ్చిన బ్రిటన్ ప్రధాని సహచరి

29 Apr, 2020 15:53 IST|Sakshi

లండన్‌: బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌(55) మరోసారి తండ్రయ్యారు. ఆయన జీవన సహచరి క్యారీ సైమండ్స్‌(32) బుధవారం లండన్‌ ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని బోరిస్‌ జంట అధికార ప్రతినిధి ధ్రువీకరించారు. ‘‘ప్రధాని, మిస్‌ సైమండ్స్‌ ఈరోజు ఉదయం తమకు పుత్రుడు జన్మించిన విషయాన్ని ప్రకటించడానికి ఎంతో సంతోషిస్తున్నారు. జాతీయ ఆరోగ్య సేవల మెటర్నరీ విభాగానికి ధన్యవాదాలు చెబుతున్నారు’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. కాగా బోరిస్‌ జాన్సన్‌కు తన మాజీ భార్య మెరీనా వీలర్‌తో ఇదివరకే నలుగురు సంతానం ఉన్నారు. (క‌రోనాను జ‌యించి తిరిగి విధుల‌కు ప్ర‌ధాని)

ఇక అధికార కన్జర్వేటివ్‌ పార్టీ కమ్యూనికేషన్స్‌ హెడ్‌గా పనిచేసిన క్యారీ సైమండ్స్‌తో బోరిస్‌ కొన్నిరోజులుగా డేటింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో 2019లో తమ బంధాన్ని బహిర్గతం చేసిన ఈ జంట త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్నామని ప్రకటించారు. కాగా బోరిస్‌ గతంలో అలెగ్రా మెస్టిన్‌ అనే మహిళను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 1993లో ఆమె నుంచి విడిపోయి మెరీనా వీలర్‌ను వివాహమాడారు. అనంతరం ఆమె నుంచి విడాకులు తీసుకుని ప్రస్తుతం క్యారీ సైమండ్స్‌తో జీవితాన్ని గడుపుతున్నారు. ఇక కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్‌ బారిన పడిన బోరిస్‌ కోలుకున్న విషయం తెలిసిందే. ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జి అయిన రెండు వారాల త‌ర్వాత ప్రధాని కార్యాలయానికి తిరిగి వచ్చిన ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. (బ్రిటన్‌లో లక్ష వరకు‍ కరోనా మృతులు ) 

మరిన్ని వార్తలు