బ్రస్సెల్స్‌లో బాంబులు ఎందుకు పేలాయి?

23 Mar, 2016 18:54 IST|Sakshi
బ్రస్సెల్స్‌లో బాంబులు ఎందుకు పేలాయి?

బ్రస్సెల్స్: ఒకప్పుడు ఐరోపా రాజకీయ, సంస్కృతికి కేంద్ర బిందువుగా భాసిల్లిన బెల్జియం రాజధాని  బ్రస్సెల్స్ నగరంపై మంగళవారం ఐసిస్ టెర్రరిస్టులు ఎందుకు దాడి చేశారు? పారిస్ దాడుల్లో నిందితుడైన సలాహ్ అబ్దెస్లామ్‌ను అనే టెర్రరిస్టును అరెస్టు చేసినందుకు నిరసనగానే వారు ఈ వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారా? ఈ దాడి వెనక ఆర్థిక, సామాజిక కోణాలు ఏమైనా ఉన్నాయా? యాభై ఏళ్ల క్రితం టర్కీ, మొరొక్కా దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన ముస్లిం కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. రానురాను నిరుద్యోగం పెరుగుతూ వచ్చింది.

 

బ్రస్సెల్స్‌లో 40 శాతం మంది యువకులు నిరుద్యోగులే. వలసదారులకు ఫ్రెంచ్, అరబ్ భాషలు తప్ప ఇతర భాషలు రావు. ఉద్యోగం రావాలంటే ఫ్రెంచ్‌తోపాటు ఫ్లెమిష్ లేదా డచ్ తప్పనిసరిగా రావాలి. అంతో ఇంతో ఇంగ్లీషు వచ్చి ఉండాలి. నిరుద్యోగంతో బ్రస్సెల్స్ యువతలో అసహనం పెరుగుతూ వచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో ముస్లిం మహిళలు బురఖాలు లేదా నికాబ్‌లు ధరించరాదంటూ బెల్జియం ప్రభుత్వం 2012లో నిషేధం తీసుకరావడంతో ముస్లిం కుటుంబాల్లో అలజడి మొదలైంది.

సౌదీ అరేబియా నుంచి వస్తున్న నిధులతో ఇక్కడ ముస్లిం పాఠశాలలను నిర్వహిస్తున్నారు. వాటిల్లో ర్యాడికలిజంను నూరిపోస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. చాలా కాలంగా బ్రస్సెల్స్‌లో రాడికల్ గ్రూపులు క్రియాశీలకంగా ఉన్నాయని, వారెప్పుడైన దేశంలో అరాచకం సృష్టించవచ్చని మీడియాలో ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఆత్మాహుతి తరహా దాడులు జరిపేందుకు ఓ తరానికి తరం సిద్ధంగా ఉందన్న వార్తలు కూడా స్థానిక మీడియాలో వచ్చాయి. ముఖ్యంగా బ్రస్సెల్స్‌లోని మొలెన్‌బీక్ ప్రాంతం ఎంతో సమస్యాత్మకమైంది. ఇక్కడే అబ్దెస్లామ్ పట్టుబడింది. అబ్దెస్లామ్ పుట్టింది బ్రెజిల్‌కాగా పారిస్ దాడుల్లో రింగ్ లీడర్‌గా వ్యవహరించి ఎన్‌కౌంటర్‌లో మరణించిన అబ్దెల్‌హమీద్ అబౌద్ కూడా బ్రెజిల్ పౌరుడే.

 ప్రపంచ టెర్రరిస్టులతో మొలెన్‌బీక్ ప్రాంతానికి సంబంధాలు ఉన్నాయి. సిరియా, ఇరాక్‌లో ఐసిస్ టెర్రరిస్టులతో కలసి పోరాడేందుకు ఇక్కడి నుంచి దాదాపు ఐదువందల మంది యువకులు వెళ్లారు. ఇంటెలిజెన్స్ వర్గాల కథనం ప్రకారం వారిలో వందమంది మాత్రమే వెనుతిరిగి వచ్చారు. మిగతా వారిలో కొంతమంది మరణించగా, మిగిలిన వారు ఐసిస్ టెర్రరిస్టులుగా మారిపోయారు. అబ్దెల్‌స్లామ్ అరెస్టుకు ఆత్మాహుతి దాడులకు సంబంధం ఉందా ? అన్న అంశాన్ని మాత్రం బ్రస్సెల్స్ పోలీసులు ఇంతవరకు తేల్చలేదు.

మరిన్ని వార్తలు