కెనడా వైపు టెక్ వర్కర్ల చూపు!

27 Jun, 2020 10:57 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇమిగ్రేషన్ పై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల టెక్ వర్కర్లు కెనడా వైపు చూసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 2017లో ప్రారంభించిన గ్లోబల్ స్కిల్స్ స్ట్రాటజీ(జీఎస్ఎస్) ప్రోగ్రామ్ ద్వారా కెనడా మూడేళ్లలో ఐదు రెట్లు ఎక్కువ మందికి వీసాలు జారీ చేసిందని ఆ దేశ ఇమిగ్రేషన్, వలసదారులు, పౌరసత్వ సంస్థ(ఐఆర్సీసీ) పేర్కొంది. (విగ్రహాల ధ్వంసం:‌ ట్రంప్‌‌ కీలక నిర్ణయం)

కంప్యూటర్ ప్రొగ్రామర్లు, ఇంటరాక్టివ్ మీడియా డెవలపర్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అనలిస్టులు, కన్సల్టెంట్లు కేటగిరీల కింద 23 వేల మందికి కెనడా వీసాలు ఇచ్చినట్లు ఐఆర్సీసీ తెలిపింది. 2020 జనవరి నుంచి మార్చి మధ్య ఇవే ఐదు కేటగిరీలకు చెందిన 2300 మంది అప్లికేషన్లకు ఆమోదం లభించిందని వివరించింది. అప్లికేషన్ పెట్టుకున్న రెండు వారాల్లోనే ప్రాసెసింగ్ పూర్తవుతున్నట్లు వెల్లడించింది. అయితే కోవిడ్–19 ప్రభావం వల్ల ఇమిగ్రేషన్ కు పెట్టుకునే వారి సంఖ్య భారీగా తగ్గినట్లు చెప్పింది.

ఈ ఫాస్ట్ ట్రాక్ ప్రోగ్రామ్ ద్వారా ఎక్కువగా వీసాలు దొరకబుచ్చుకుంటున్న వారిలో 62.1 శాతంతో ఇండియన్స్ టాప్ లో ఉన్నారని తెలిపింది. ఆ తర్వాతి స్థానంలో చైనీయులు ఉన్నారని చెప్పింది. వెయ్యి మంది అమెరికన్లకు సైతం వీసాలు జారీ అయ్యాయని వెల్లడించింది. (మాయా పుస్తకం: కాలిస్తేనే చదవగలం)

కోవిడ్–19 లాక్ డౌన్ నుంచి ఉపశమనం తర్వాత కెనడాకు టెక్ వర్కర్లు క్యూ కట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాంకోవర్ లోని మెక్​క్రెయా ఇమిగ్రేషన్ లా సంస్థకు అనుబంధంగా పని చేస్తున్న కైల్ హైండ్​మన్ పేర్కొన్నారు. ఓ పెద్ద కంపెనీ వర్కర్లను కెనడాకు రప్పించేందుకు తోడ్పడాలని కోరినట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు