అంగట్లో పెళ్లి కూతుళ్ల అమ్మకం!

18 Apr, 2016 16:26 IST|Sakshi
అంగట్లో పెళ్లి కూతుళ్ల అమ్మకం!

సంతలో పశువులను అమ్మినట్లు అక్కడ చిన్నారి పెళ్లి కూతుళ్లను అమ్ముతారు. 13, 14 ఏళ్లు కూడా నిండని అమ్మాయిలను దాదాపు రెండు లక్షల రూపాయలకే అమ్మేస్తారు. అందులో పెళ్లి కూతురికి నయాపైసా కూడా దక్కదు. చైనా యువకులు వారిని ఎగబడి కొనుక్కున్నా డబ్బులు మాత్రం అమ్మాయిలను విక్రయించిన స్మగ్లర్లకే పోతాయి. అమ్మాయిల తల్లిదండ్రులకు ఈ విషయం ఎప్పటికీ తెలియదు. అలా అంగడి బొమ్మల్లే అమ్ముడుపోయిన అమ్మాయిలు చైనా యువకులతో కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిందే. ఆ తర్వాత జీవితంలో తమ తల్లిదండ్రులను గానీ, పుట్టిన గడ్డను గానీ చూసే అవకాశం ఎప్పటికీ లభించదు.

చైనా యువకులు, చైనా అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలనుకుంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పెళ్లి కూతురుకు ఎదురుకట్నం ఇచ్చి, పెళ్లి ఖర్చులు భరించడమే కాకుండా సొంతిల్లు కలిగి ఉండాలి. సొంతిల్లు లేనివారిని పెళ్లి చేసుకునేందుకు చైనా యువతులు ముందుకు రారు. కారణం స్త్రీ, పురుష నిష్పత్తిలో తేడా కారణంగా చైనా అమ్మాయిలకు డిమాండ్‌ ఎక్కువ. దశాబ్దాల తరబడి ఏక సంతాన విధానాన్ని చైనా ప్రభుత్వం పాటించడం వల్ల ఆ దేశంలో అమ్మాయిల కొరత ఏర్పడిందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘాలు విశ్లేషించాయి. ఈ కారణం వల్ల చైనాలో పెళ్లి కూతుళ్లకు డిమాండ్‌ పెరిగింది. దీన్ని అవకాశంగా తీసుకొని చైనాలో అక్రమ మానవ రవాణా ముఠాలు పుట్టుకొచ్చాయి. వారి కన్ను పొరుగునే ఉన్న వియత్నాం సరిహద్దు గ్రామాలపై పడింది.

చైనాలో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వియత్నాం బాలికలను బుట్టలో వేస్తారు. ఫ్రెండ్స్‌ పార్టీల పేరిట పిలిపించి మద్యం తాగిస్తారు. డ్రగ్స్‌ ఇస్తారు. వారు ఆ మత్తులో ఉండగానే సరిహద్దు దాటించి చైనా సంతకు తీసుకెళతారు. ఈమధ్య సోషల్‌ మీడియా ద్వారా కూడా చదువుకుంటున్న వియత్నాం బాలికలను ఎర వేస్తున్నారు. మీడియా ముందుకు వచ్చి తమ వ్యథార్థ గాధలను వినిపించిన లాన్, ఎన్‌గుయన్‌ వియత్నాం నుంచి చైనాకు అలా చేరిన వారే. 'పరీక్షలకు సిద్ధమవుతున్న నన్ను ఓ రోజు ఫ్రెండ్స్‌ పార్టీకి పిలిచారు. బలవంతంగా మద్యం తాగించారు. ఇంటికెళ్తానంటే వారించి అక్కడే పడుకోబెట్టారు. తెల్లవారి లేచేసరికి కొత్త ప్రాంతంలో ఉన్నాను. నేను ఎక్కడున్నానని వాకబు చేస్తే చైనాలో ఉన్నానని తెలిపారు. నా పక్కన మరికొంత మంది బాలికలు ఉన్నారు. మా చుట్టూ వస్తాదుల లాంటి గార్డులు ఉన్నారు. ఎంత ప్రతిఘటించినా నన్ను ఓ చైనా యువకుడికి అమ్మేశారు' అని 13 ఏళ్ల లాన్‌ తన గాధను వెల్లడించింది.

'నన్ను రెండు లక్షల రూపాయలకు అమ్మకానికి పెట్టారు. నేను దాన్ని దాన్ని తీవ్రంగా ప్రతిఘటించాను. నన్ను చిత్రహింసలకు గురిచేశారు. అన్నం పెట్టకుండా మాడ్చారు. చివరకు చంపేస్తామని బెదిరించారు. చేసేదేమీలేక అంగీకరించాను. రెండు లక్షల ఐదువేల రూపాయలకు ఓ చైనా యువకుడికి అమ్ముడుపోయాను. ఆ యువకుడిని పెళ్లి చేసుకున్నాను. ఆయన నన్ను బాగానే చూసుకున్నారు. అయినా పుట్టిన దేశాన్ని, తల్లిదండ్రులను చూడకుండా ముక్కూమొహం తెలియని వ్యక్తితో ఎలా కాపురం చేసేది? అడ్జెస్టు కాలేకపోయాను. నా ప్రతిఘటన మళ్లీ మొదలైంది. దాంతో నా అత్త స్మగ్లర్లను పిలిచి నన్ను వారికి అప్పగించింది. తాను వారికి అంతకుముందు చెల్లించిన డబ్బులు వెనక్కి తీసుకుంది. నన్ను తిరిగి వియత్నాం పంపించాల్సిందిగా స్మగ్లర్లను వేడుకున్నాను. వారు వినకుండా మరో చైనా యువకుడికి నన్ను అమ్మేశారు. కథ మళ్లీ మొదటికొచ్చింది' అని 16 ఏళ్ల ఎన్‌గుయన్‌ వివరించారు.

ఇలాంటి కథలు అనేకం ఉన్నాయని వియత్నాంలో ఐక్యరాజ్యసమితి తరఫున మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఓ నేషనల్‌ ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ హా తి వ్యాన్‌ ఖనాహ్‌ మీడియాకు తెలిపారు. వియత్నాం ప్రభుత్వంతో కలసి తాము ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మానవ అక్రమ రవాణాకు పూర్తిగా తెర పడట్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ రవాణా ముఠాలను పట్టుకొని అరెస్టు చేయడం, వారి నుంచి బాధితులను విడిపించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయని ఆమె తెలిపారు. స్మగ్లర్ల చేతిలో మోసపోకుండా వియత్నాం బాలికల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కూడా తాము కృషి చేస్తున్నామని చెప్పారు.

మరిన్ని వార్తలు