రిషి సునాక్‌ ఇంట దీపావళి వేడుక

10 Nov, 2023 05:49 IST|Sakshi
లండన్‌లో దీపావళి వేడుక జరుపుకుంటున్న రిషి సునాక్, అక్షత

లండన్‌: భారత సంతతికి చెందిన బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్, అక్షతా మూర్తి దంపతులు 10 డౌనింగ్‌ స్ట్రీట్‌లోని తమ అధికార నివాసంలో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. బుధవారం జరిగిన ఈ వేడుకల్లో పలువురు ప్రవాస భారతీయులు, పార్లమెంటేరియన్లు, పారిశ్రామిక వేత్తలు, బాలీవుడ్‌ ప్రముఖులు పాల్గొ న్నారు.

ప్రధానిగా సునాక్‌ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం సాయంత్రం ప్రధానమంత్రి నివాసాన్ని రంగురంగుల దీపాలతో అలంకరించారు. ప్రధాని రిషి సునాక్, అక్షతామూర్తి దంపతులు కలిసి దీపాలు వెలిగిస్తున్న దృశ్యాలను ప్రధాని కార్యాలయం ‘ఎక్స్‌’లో పోస్టు చేసింది. ప్రధాని రిషి సునాక్‌ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

కమలా హ్యారిస్‌ నివాసంలోనూ..
వాషింగ్టన్‌: భారత సంతతికి చెందిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ మంగళవారం వాషింగ్టన్‌లోని తన అధికార నివాసంలో దీపావళి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు భారతీయ అమెరికన్లు సహా 300 మంది వరకు పాల్గొన్నారు. దీపాలు వెలిగించిన అనంతరం చట్టసభల ప్రతినిధులైన రో ఖన్నా, శ్రీ థానెదార్, రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్‌ తదితరులతో ఆమె మాట్లాడారు. ఈసందర్భంగా ఆమె ఇజ్రాయెల్, హమాస్‌ మధ్య పోరును ప్రస్తావించారు. పాలస్తీనియన్లకు సాయం అందించేందుకు అమెరికా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

మరిన్ని వార్తలు