ఆ ద్వీపానికి.. 59 దేశాలకు వీసా ఫ్రీ జర్నీ

18 Apr, 2018 17:08 IST|Sakshi

బీజింగ్‌ : చైనాలో అడుగుపెట్టాలంటే అక్కడి వీసా నిబంధనలు కఠినంగా ఉంటాయని తెలిసిందే. కానీ చైనా దక్షిణ ప్రాతంలోని హైనన్‌ ద్వీపానికి వీసా లేకుండానే సందర్శకులను ఆహ్వానిస్తోంది. ఈ విషయాన్ని బుధవారం చైనా అధికారులు తెలిపారు. అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, జర్మనీ సహా 59 దేశాలకు చెందిన సందర్శకులకు 30 రోజుల పాటు ఈ ద్వీపంలో ఎలాంటి వీసా లేకుండా పర్యటించడానికి అనుమతిస్తారు. ఈ జాబితాలో భారత్‌కు అవకాశం కల్పించలేదు. నూతన విధానం మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానుందని స్థానిక మీడియా తెలిపింది.

హైనన్‌ ద్వీపాన్ని పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందడానికి ఈ విధానం తోడ్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. 2010లోనే చైనా 21 దేశాలకు చెందిన పర్యాటకులకు 15 రోజుల పాటు వీసా లేకుండా హైనన్‌లో పర్యటించే అవకాశం కల్పించింది. ఆ తర్వాత 2010లో ఆ సంఖ్యను 26కు పెంచింది. ఈ నిర్ణయం తర్వాత పర్యాటకంగా అభివృద్ధి జరగడంతో పాటు, ఆదాయం పెరగడంతో.. తాజాగా దీనిని 59 దేశాలకు పొడిగించటంతో పాటు అక్కడ గడిపే సమయాన్ని మరింత పెంచింది. అంతర్జాతీయ పర్యాటక కేంద్రానికి ఉండాల్సిన అన్ని అనుకూలతలు హైనన్‌లో ఉండటంతో భారీగా ఆదాయం రాబట్టడానికి చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

మరిన్ని వార్తలు