పన్నెండేళ్ల పిండం.. ఆరోగ్యకరమైన బిడ్డ

28 Feb, 2016 01:05 IST|Sakshi
పన్నెండేళ్ల పిండం.. ఆరోగ్యకరమైన బిడ్డ

చైనాలో అత్యంత అరుదైన శిశువు జన్మించి ప్రపంచ ఖ్యాతి గాంచింది. 12 ఏళ్ల పాటు ఆస్పత్రిలో భద్రపరచిన పిండం.. దేశంలో లాంగెస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీగానే కాక అత్యంత ఆరోగ్యకరమైన బిడ్డగా పేరు తెచ్చుకుంది. చైనా వాయవ్య షాంగ్జీ రాష్ట్రంలోని 40 ఏళ్ల మహిళ లీ గేవ్ తన రెండో కొడుకుగా 3.440 కిలోగ్రాముల బిడ్డకు జన్మనిచ్చి రికార్డు సృష్టించింది. గ్జియాన్ నగరంలోని తంగ్డు ఆస్పత్రిలో బుధవారం లీ తన బిడ్డకు జన్మనిచ్చింది.  

మహిళల్లో సంతానోత్పత్తి, గర్భధారణపై ప్రభావం చూపే ఫెలోపియన్ నాళాలు మూసుకుపోవడం, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ సమస్యలతో బాధపడుతున్న లీ గేవ్.. 2003 లో ఐవీఎఫ్ ద్వారా గర్భధారణకు ప్రయత్నాలు ప్రారంభించింది. అప్పట్లో డాక్టర్లు ఆమె నుంచి సేకరించిన 12 అండాలను.. ఆమె భర్త వీర్యకణాలతో కలపి  పిండాలుగా రూపొందించారు. వాటిలోని రెండు పిండాలను లీ గర్భంలో ప్రవేశపెట్టారు. మిగిలిన వాటిలో ఆరోగ్యంగా ఉన్న ఏడింటిని అలాగే ఆస్పత్రిలోని రీ ప్రొడక్టివ్ మెడిసిన్ సెంటర్లో భద్రపరిచారు. అనంతరం 2004 లో లీ ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అప్పట్నుంచీ అత్యవసర పరిస్థితుల్లో వాడేందుకు ఆ పిండాలను భద్రపరిచడానికి ఆస్పత్రికి రోజుకు 50 సెంట్లు అంటే సుమారు 45 రూపాయల చొప్పున చెల్లిస్తూ వస్తోంది. గతేడాది చైనా ఒకే బిడ్డ విధానాన్ని ఎత్తివేయడంతో లీ.. రెండో బిడ్డను కనాలని నిర్ణయించుకుంది. దీంతో భద్రపరిచిన పిండాల నుంచి రెండు ఆరోగ్యమైన పిండాలను డాక్టర్లు ఆమె గర్భంలోకి ప్రవేశపెట్టారు. వాటిలో ఒకటి విజయవంతమైంది. సాధారణంగా తమ ఆస్పత్రిలో ఈ పద్ధతిని అవలంబించే సమయంలో గర్భంలోకి రెండు మూడు పిండాలను ప్రవేశపెడతారని, ఎందుకంటే వాటిలో 40 శాతమే సురక్షితంగా ఉండే అవకాశం ఉందని తంగ్డు ఆస్పత్రి రీ ప్రొడక్టివ్ మెడిసిన్ సెంటర్ డైరెక్టర్ వాంగ్ గ్జియో హాంగ్ తెలిపారు. పిండాలను భద్రపరచడంతో అదృష్టం కొద్దీ రెండో బిడ్డకు జన్మనిచ్చే అవకాశం కలిగిందని  లీ గేవ్ భర్త ఆనందంగా చెబుతున్నాడు.

మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ లూయిస్ బ్రౌన్ 1978 లో బ్రిటన్‌లో జన్మించాడు. ఆ తర్వాత సుమారు 50 లక్షల మంది పిల్లలు ఐవీఎఫ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా జన్మించారు. చైనా ప్రధాన భూభాగంలో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ జెంగ్ మెంగ్జు 1988 లో జన్మించాడు. చైనాలో సుమారు 40 శాతం మంది వంధ్యత్వంతో బాధపడుతున్నారని, ప్రభావవంతమైన పునరుత్పత్తి సహాయ పద్ధతుల్లో ఐవీఎఫ్ ఒకటి అని వాంగ్ తెలిపారు. 2003 నుంచీ తంగ్డూ ఆస్పత్రి పిండాలను భద్రపరచడం ప్రారంభించిందని ఇప్పటివరకూ సుమారు లక్షకు పైగా పిండాలను భద్రపరచగా, వాటిలో 27000 వరకూ పునరుత్పత్తికి వినియోగించామని... ఈ పద్ధతి ద్వారా  4,293 ఆరోగ్యకరమైన టెస్ట్ ట్యూబ్ బేబీలు జన్మించినట్లు వాంగ్ తెలిపారు.

మరిన్ని వార్తలు