ఇల్లు కాలినా లెక్కచేయకుండా సెల్ఫీలు

14 Jan, 2018 09:29 IST|Sakshi

నానింగ్‌ : సాధారణంగా ఇల్లు తగలబడితే ఎవరైనా తీవ్ర విషాదంలోకి వెళతారు. కంగారెత్తిపోయి ఏం చేయాలో పాలుపోక ముఖంలో చిరునవ్వు మాయమై దుఃఖాన్ని వేలాడేసుకొని కనిపిస్తారు. కానీ, చైనాలో ఓ జంట మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. తగలబడిన తమ ఇంట్లో నిల్చొని సెల్ఫీలతో పోటీ పడ్డారు. పదుల సంఖ్యలో హాయిగా నవ్వుకుంటూ సెల్ఫీలు తీసుకున్నారు. వీడియోలు కూడా రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పెట్టారు. ‘నేనప్పుడు సరిగ్గా బాత్‌ రూమ్‌లో ఉన్నాను. ఏదో కాలుతున్న వాసన వచ్చింది.

డోర్‌ తీసేవరకు పెద్ద మంటలు కనిపించాయి. ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించిందని, వస్తువులన్నీ కాలిపోతున్నాయని అర్ధమైంది. నేరుగా వెళ్లి గర్ల్‌ఫ్రెండ్‌ను నిద్ర లేపాను. వెంటనే ఇద్దరం కలిసి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాము. చుట్టుపక్కల వారు వచ్చి కూడా మంటలు ఆపేశారు’ అని జాంగ్‌ చెంగ్‌ అనే వ్యక్తి తెలిపాడు. ఆ రోజు వాళ్లిద్దరు ఇంట్లో జన్మదిన వేడుకలు జరుపుకున్నారంట. అయితే, మంటలు ఆరిపోయిన తర్వాత వాటిని శుభ్రం చేయడం మానేసి నేరుగా సెల్ఫీ దిగే పనులు మొదలుపెట్టి వాటిని సోషల్‌ మీడియాలో పెట్టారు. జరిగిన నష్టాన్ని చూసి తాము కుంగిపోలేదని, ఇది తమ సానూకూల స్వభావానికి నిదర్శనం అంటూ వారు ఆ సెల్ఫీలతోపాటు చెప్పుకొచ్చారు.   

  

మరిన్ని వార్తలు