ఒక్కడే మట్టితో ఏడంతస్తులు కట్టేశాడు

15 Feb, 2016 17:45 IST|Sakshi
ఒక్కడే ఏడంతస్తులు కట్టేశాడు

బీజింగ్: సాధారణంగా ఉన్న స్థలమంతా తనకే కావాలని తోడబుట్టిన సోదరులను కూడా మోసం చేసే సోదరులున్న ఈ రోజుల్లో చైనాలో మాత్రం లేని తన సోదరుల కోసం ఓ సోదరుడు ఒక్క కూలి లేకుండా సొంతంగా ఏడంతస్తుల నివాసం కట్టాడు. అయితే, అత్యంత హంగులు, సొబగులతో ఉన్నదికాదు. కాంక్రీటు, ఇనుప చువ్వలు, సున్నం రంగులు వంటివి దానికి ఉపయోగించలేదు. ఒక్క కూలీని కూడా పెట్టలేదు. మట్టి, రాళ్లు, కట్టెలు, పాత రేకులు ఇవే ఆ ఇంటి నిర్మాణం కోసం ఉపయోగించిన సామాగ్రి. ఆ ఇంటి నిర్మాణాన్ని అతడు పూర్తి చేయడానికి అతడికి పట్టిన సమయం సరిగ్గా పదేళ్లు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. చైనాలోని షడాంగ్ లోగల లిన్ కూ అనే ప్రాంతంలో హు గాంగ్ జౌ(55) అనే ఓ రైతు ఉన్నాడు. అతడికి ఆరుగురు సోదరులు ఉన్నారు. అయితే, వాస్తవానికి వారు ఎప్పుడో చనిపోయారని స్థానిక మీడియా చెప్తోంది. కానీ, అతడు మాత్రం తన సోదరులు ఇంకా బతికే ఉన్నారని భావిస్తున్నాడు. వారు ఏదో ఒకరోజు తిరిగి వస్తారని వారికోసమే ఆ ఇల్లు నిర్మించానని చెప్తున్నాడు. ఈ ఇంటిని నిర్మించే క్రమంలో పలుమార్లు అనారోగ్యం పాలయ్యాడు. రెండో అంతస్తు నిర్మించే సమయంలో ఏకంగా మంచాన పడ్డాడు. అయినా, ఎలాగైన ఏడంతస్తులు పూర్తి చేయాలన్న తన సంకల్పం అతడిని మంచం నుంచి బయటపడేసింది.

తిరిగి ఏడు స్టేర్లు పూర్తి చేశాడు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్లే సుదీర్ఘకాలంపాటు ఈ పనిలో నిమగ్నమై ఉన్నాడని, అతడి చర్యను ఎవరు అడ్డుకున్న వారిపట్ల అతడి ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో అని భయపడి కనీసం ప్రభుత్వాధికారులు కూడా అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో ఆ ఇల్లు కాస్త జపాన్ యానిమేటెడ్ చిత్రం హాల్స్ మూవింగ్ క్యాజిల్ లోని ఇల్లు మాదిరిగా తయారై అలా ఉండిపోయింది. చుడ్డానికి ఎబ్బేట్టుగా కనిపించే ఆ ఇంటికి సందర్శకుల తాకిడేం తక్కువ కాదు. ఎంతోమంది ఆ ఇంటిని చూడ్డానికి వచ్చి వారంతా ఫొటోలు తీసుకుని వెళుతుంటే.. మట్టి రాళ్లు కలిపి అంతెత్తు కట్టిన ఆ ఇల్లు గాలి వానకు ఎప్పుడు కూలి తమపై పడుతుందో అని చుట్టుపక్కల వారు మాత్రం హడలెత్తిపోతున్నారు. ఇక గాంగ్ జౌ ఖాళీ సమాయాల్లో ఆ ఇంటికి రిపేర్లు చేసుకుంటూ కూర్చున్నాడు.

మరిన్ని వార్తలు