పాకిస్థాన్‌లో చైనా అణు జలాంతర్గామి!

6 Jan, 2017 14:52 IST|Sakshi
పాకిస్థాన్‌లో చైనా అణు జలాంతర్గామి!
చైనాకు చెందిన అణు జలాంతర్గామి ఒకటి కరాచీ ఓడరేవులో గత సంవత్సరం మే నెలలో లంగరు వేసి ఉంది. ఈ విషయం గూగుల్ ఎర్త్ తీసిన ఫొటోలలో స్పష్టంగా కనిపించింది. దాన్నిబట్టి చూస్తే.. ఇంతకుముందు కంటే భారతీయ యుద్ధనౌకల కదలికలను చైనా మరింత దగ్గరగా చూస్తున్నట్లు స్పష్టమైంది. సంప్రదాయ జలాంతర్గాములలా కాకుండా, అణు జలాంతర్గాములు ఎంత దూరమైనా వెళ్లగలవు. వాటిలో ఉండే అణు రియాక్టర్ల కారణంగా ఇంధన కొరత అనేది రానే రాదు. అంటే, టోర్పడోలు, క్రూయిజ్ మిసైళ్లు ఉన్న ఈ జలాంతర్గాములను ఎంత కాలమైనా నీటి అడుగునే మోహరించవచ్చు, వాటిని గుర్తించడం కూడా దాదాపు అసాధ్యం అవుతుంది. 
 
ముందుగా ఉపగ్రహ ఛాయాచిత్రాలను గుర్తించడంలో నిపుణుడైన ఒక వ్యక్తి ఈ జలాంతర్గామిని గుర్తించారు. గూగుల్ ఎర్త్‌లోకి వెళ్లి, 2016 మే నాటికి వెళ్తే చైనా జలాంతర్గామి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, ఇక్కడ ఉన్నది అణుజలాంతర్గామి అని కచ్చితంగా చెప్పలేమని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. అవి బాగా నిశ్శబ్దంగా ఉండి, అసలు గుర్తించడానికి ఏమాత్రం వీలులేకుండా ఉంటాయని చెబుతున్నారు. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) యుద్ధ నౌకలు, జలాంతర్గాముల కదలికల మీద భారత నౌకాదళం ఓ కన్నేసి ఉంచిందని, విమానాలు, నౌకల సాయంతో వాటిని పరిశీలిస్తుంటామని నౌకాదళం చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా గత నెలలోనే చెప్పారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఈ అణు జలాంతర్గామి కనిపించడం అనుమానాలకు తావిస్తోంది. 
మరిన్ని వార్తలు