లాక్‌డౌన్‌తో రోజుకు 2.25 లక్షల కోట్ల నష్టం

6 Apr, 2020 14:30 IST|Sakshi

లండన్‌ : కరోనా వైరస్‌ను అరికట్టడంలో భాగంగా బ్రిటన్‌లో అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ వల్ల రోజుకు 2.4 బిలియన్‌ డాలర్ల (దాదాపు 2.25 లక్షల కోట్ల రూపాయలు) నష్టం వాటిల్లుతోందని ‘సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ బిజినెస్‌ రిసర్చ్‌’ అంచనా వేసింది. దుకాణాలు, మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు మూత పడడంతోపాటు పరిశ్రమలు పని చేయక పోవడం, భవన నిర్మాణాలు నిలిచి పోవడంతో రోజుకు ఈ మేరకు నష్టం వాటిల్లుతోందని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. లక్షలాది మంది కార్మికులను ఇళ్లకే పరిమితం చేయడంతో దేశంలో 31 శాతం ఉత్పాదన పడి పోయిందని వారు పేర్కొన్నారు.

కరోనాను కట్టడి చేయడం కోసం లాక్‌డౌన్‌ను కచ్చితంగా అమలు చేయడం వల్ల ఆర్థికరంగంలో అనర్ధాలు చోటు చేసుకుంటున్నాయని, ఈ పరిస్థితి ఇలాగే మరికొంతకాలం కొనసాగితే బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి పోతుందని, అయితే ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సిందీ ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌ను ఇలాగే మరికొంతకాలం కొనసాగించాలా లేదా సడలించాలా? విషయంలో ఇప్పటికే బ్రిటన్‌ ఆరోగ్య మంత్రి మట్‌ హన్‌కాక్, ట్రెజరీ ఛాన్సలర్‌ రిషి సునక్‌ మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు తెలియజేస్తున్నాయి.

మరి కొన్ని వారాల్లోగా లాకౌడౌన్‌ను ఎత్తివేయక పోయినట్లయితే బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ కోలుకోనంతగా దెబ్బతింటోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్‌ కరోనా బారిన పడి ఇప్పటికే దాదాపు ఐదు వేల మంది మరణించడంతో ప్రస్తుతం లాక్‌డౌన్‌ను సడలించే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. పైగా కరోనా వైరస్‌ బారిన పడిన బ్రిటన్‌ ప్రధానిని ఆస్పత్రికి తరించారు. ఆయన కోలుకుంటేగానీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకునే పరిస్థితిలో లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. (ఆస్పత్రిలో చేరిన బ్రిటన్‌ ప్రధాని)

>
మరిన్ని వార్తలు