మూర్ఖులుగా చరిత్రలో నిలిచిపోకండి: ఇమ్రాన్‌

5 Apr, 2020 18:39 IST|Sakshi

ఇస్లామాబాద్‌: దేశంలో ఓవైపు కరోనా మహమ్మారి వినాశనం సృష్టిస్తుంటే మరోవైపు ప్రజలు నిర్లక్ష్యధోరణిలో వ్యవహరిస్తుండటం పట్ల పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం లాహోర్‌లో కరోనాపై పోరాటంలో భాగంగా ‘కరోనా రిలీఫ్‌ ఫండ్‌’ను ప్రారంభించిన అనంతరం ఇమ్రాన్‌ మాట్లాడారు. సోషల్‌ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మోద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా కష్టకాలంలో మూర్ఖులుగా ప్రవర్తించకండి అంటూ కోరారు. ఈ మహమ్మారి నియంత్రణ పాటించనివారిని ఎవరినీ వదిలిపెట్టదని హెచ్చరించారు.  

‘గత కొద్దిరోజులుగా సోషల్‌ మీడియాలో జరుగుతున్న ఓ ప్రచారం నా దృష్టికి వచ్చింది. అల్లా పాక్‌ ప్రజలకు కరోనా మహమ్మారి రాకుండా చేశారనే ప్రచారం సాగుతోంది. ఇలాంటి వాటిని దయచేసి నమ్మకండి. ఇలాంటి పిచ్చి ప్రచారాలు చేయోద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. మహమ్మారి కరోనా ఎవరినీ విడిచి పెట్టదు. పాక్‌ ప్రజలకు రోగనిరోధక శక్తి ఎక్కువ కలిగి ఉంటారని దీంతో కరోనా రాదని, వచ్చిన ఏం కాదనే భావన కూడా సరైనది కాదు. న్యూయార్క్‌ నగరాన్ని చూడండి.. ఎంతో మంది ధనికులున్న ఆ సిటీ పరిస్థితిని గమనించండి. కరోనా వైరస్‌ రూపంలో మనకొక పెద్ద చాలెంజ్‌ ఎదురైంది. ఈ సవాల్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాదిద్దాం. ఈ సమయంలో మూర్ఖులుగా ప్రవర్తించి చరిత్రలో నిలిచిపోకండి’అని పాక్‌ ప్రజలకు ఇమ్రాన్‌ ఖాన్‌ విజ్ఞప్తి చేశారు. 

అనంతరం కరోనా వైరస్‌ అత్యంత వేగంగా విస్తరిస్తున్న పంజాబ్‌ ప్రావిన్స్‌లో ఇమ్రాన్‌ పర్యటించారు. అక్కడ కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోడానికి చేస్తున్న చర్యలను, కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆస్పత్రిని పర్యవేక్షించారు. అయితే పాక్‌లో ఇప్పటివరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించకపోవడం పట్ల ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. విద్యాసంస్థలు, షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్లను మాత్రమే పాక్‌ ప్రభుత్వం మూసేయించగా.. ప్రజారవాణా, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు వెసులుబాటు కల్పించింది. పాకిస్తాన్‌లో ఇప్పటివరకు 2,818 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా.. 41 మంది మృతి చెందారు. 

చదవండి:
క‌రోనా: డీమార్ట్ రూ.155 కోట్ల విరాళం
‘హాష్‌ట్యాగ్‌లు’ సృష్టించి వైరల్‌​​​​​​​

>
మరిన్ని వార్తలు