మహమ్మారితో కొలువులు కుదేలు..

5 Apr, 2020 18:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ వ్యాప్తి, దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దిగజారుతుందని పరిశ్రమల సంస్థ సీఐఐ నిర్వహించిన సీఈఓల స్నాప్‌ పోల్‌లో వెల్లడైంది. మహమ్మారి వైరస్‌ ఎఫెక్ట్‌తో కంపెనీల రాబడి, డిమాండ్‌ గణనీయంగా పడిపోవడంతో పాటు ఉద్యోగాల్లో కోతకు దారితీస్తుందని పలువురు సీఈఓలు అభిప్రాయపడ్డారు. భిన్న రంగాలకు చెందిన దాదాపు 200 మంది సీఈఓలు ఈ ఆన్‌లైన్‌ సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రస్తుత త్రైమాసంలో తమ రాబడులు పదిశాతం పైగా పడిపోతాయని, లాభాలు 5 శాతం మేర పతనమవుతాయని సర్వే పేర్కొంది. కంపెనీల రాబడులు, లాభాలపై వైరస్‌ ప్రతికూల ప్రభావం దేశ జీడీపీ వృద్ధి రేటునూ ప్రభావితం చేయనుందని సీఐఐ వ్యాఖ్యానించింది.

ఇక ఆన్‌లైన్‌ సర్వేలో పాల్గొన్న సీఈఓల్లో పలువురు రాబోయే రోజుల్లో ఉద్యోగాల్లో కోత తప్పదని పేర్కొన్నారు. తమ తమ రంగాల్లో కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌లతో పలు కొలువులు కోల్పోయే పరిస్థితి నెలకొందని సర్వేలో పాల్గొన్న 52 సంస్ధల ప్రతినిధులు వెల్లడించారు. ఇక 15 శాతం మేర ఉద్యోగాలు తగ్గుముఖం పడతాయని 47 శాతం మంది అంచనా వేయగా, లాక్‌డౌన్‌ ముగిసే నాటికి 15 నుంచి 30 శాతం ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆన్‌లైన్‌ సర్వేలో పాల్గొన్న వారిలో 32 శాతం సంస్థలు అభిప్రాయపడ్డాయి. మరోవైపు ప్రస్తుతం తమ ఆర్డర్‌ బుక్‌ ఖాళీగా ఉందని 80 సంస్ధలు పేర్కొనడం గమనార్హం. ఇక లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత తమ వద్ద ఉన్న స్టాక్‌ ఓ నెల వరకూ మాత్రమే సరిపడా ఉందని 40 శాతం పైగా సంస్ధలు వెల్లడించాయి.

చదవండి : కరోనా కలకలం : 24 గంటల్లో 472 కేసులు

లాక్‌డౌన్‌ సమయంలో సరుకు రవాణాకు ఇబ్బంది ఎదురవుతోందని నిత్యావసర వస్తువుల తయారీ, సరఫరా సంస్ధలు వెల్లడించాయి. నిత్యావసరాల వస్తువులు, ఉత్పత్తుల తయారీ, సరఫరాకు ప్రభుత్వం అనుమతించినా స్ధానిక అధికారులు మాత్రం నిత్యావసరాల సరఫరాలపైనా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారని సీఐఐ ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్‌ మహమ్మారితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిశ్రమకు ప్రభుత్వం ఆర్థిక ఉద్దీపన ప్యాకేజ్‌ను ప్రకటించి ఆదుకోవాలని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ కోరారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు