టెర్రరిస్టుకు కూడా టిప్పు ఇవ్వాలా..!

19 Jul, 2018 20:10 IST|Sakshi

టెక్సాస్‌ : హోటల్‌కి వచ్చిన వారికి సాదరంగా ఆహ్వానం పలకడం.. వారి నుంచి ఆర్డర్‌ తీసుకోవడం... భోజనం వడ్డించడం.. తర్వాత బిల్‌ ఇవ్వడం.. తాము చేసిన సేవలకు మెచ్చి టిప్‌ ఇస్తే తీసుకోవడం.. ఇవీ సాధారణంగా హోటల్‌ బేరర్‌ల పని. టెక్సాస్‌లోని ఓ రెస్టారెంట్‌కు చెందిన ఖలీల్‌ కేవిల్‌ అనే యువకుడు కూడా ఇదే పని చేశాడు. బిల్‌తో పాటు.. టిప్‌ కూడా తీసుకుందామని టేబుల్‌ దగ్గరికి చేరిన ఖలీల్‌కు ఊహించని షాకిచ్చాడు ఓ కస్టమర్‌.

అసలు విషయమేమిటంటే.. ఖలీల్‌ పనిచేసే రెస్టారెంట్‌కి వచ్చిన ఓ కస్టమర్‌ 108 డాలర్ల బిల్‌ చెల్లించాడు. కానీ టిప్‌ ఇ‍వ్వలేదు సరికదా.. ఖలీల్‌ పేరును బ్లాక్‌ ఇంక్‌తో రౌండప్‌ చేయడంతో పాటు... ‘మేము టెర్రరిస్టుకు టిప్‌ ఇవ్వము’  అంటూ రాశాడు. దీంతో కంగుతిన్న ఖలీల్‌.. తన పేరు చూసి ముస్లిం అనుకుని ఈవిధంగా రాసి ఉంటారని భావించాడు. విద్వేషం, జాతి వ్యతిరేక భావాలు గల వ్యక్తులు ఇలాగే స్పందిస్తారంటూ బిల్‌ స్లిప్‌ ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. ఖలీల్‌ పోస్ట్‌ను షేర్‌ చేసిన నెటిజన్లు అతడికి మద్దతుగా నిలవడంతో పాటు కొంత డబ్బును కూడా పంపిస్తున్నారు.

ఆయన పేరు మీదుగానే..
ఈ విషయమై స్థానిక మీడియాతో మాట్లాడిన ఖలీల్‌.. క్రిస్టియన్‌ అయిన తనకు ఖలీల్‌ అనే పేరు ఎలా వచ్చిందో తెలిపాడు. ‘మా నాన్న మిలిటరీలో పని చేశారు. ఆ సమయంలో ఆయనకు ఖలీల్‌ అనే వ్యక్తి పరిచయమయ్యారు. కాలక్రమంలో వారిద్దరి మధ్య స్నేహం ఎంతగానో బలపడింది. కానీ అకస్మాత్తుగా జరిగిన ఓ ఆక్సిడెంట్‌లో ఖలీల్‌ అంకుల్‌ ప్రాణాలు కోల్పోయారు. ఆయన స్నేహానికి గుర్తుగా నా పేరుకు ముందు ఖలీల్‌ అని చేర్చారని’  తన పేరు వెనుక ఉన్న రహస్యాన్ని వెల్లడించాడు. తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన‍్యవాదాలు తెలిపిన ఖలీల్‌.. ‘డబ్బే ప్రధానం కాదు. మనిషిని మనిషిలాగే చూడాలంటూ’  సదరు కస్టమర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.

మరిన్ని వార్తలు