సెల్ఫీ పిచ్చితో డాల్ఫిన్ను చంపేశారు..

19 Feb, 2016 12:06 IST|Sakshi
సెల్ఫీ పిచ్చితో డాల్ఫిన్ను చంపేశారు..

బ్యూనస్ ఎయిర్స్: విభిన్న రీతుల్లో సెల్ఫీలు తీసుకోవడం, వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి హిట్స్, లైక్స్ పొందడం ఓ వ్యసనంగా మారింది. ఇది ఎంతలా అంటే సెల్ఫీల మోజులో తమ ప్రాణాలను పోగొట్టుకోవడమే కాదు.. ఇతర జీవుల ప్రాణాలను సైతం తీస్తున్నారు. అర్జెంటీనాలో సెల్ఫీ తీసుకోవడానికి పోటీ పడి ఓ డాల్ఫిన్ను చంపేశారు.
 
సముద్రతీర పట్టణమైన సాంటా టెరిసిటాలో బీచ్లో సేదతీరుతున్న వారికి ఓ బేబీ డాల్ఫిన్ కనిపించింది. అదీ అరుదైన జాతికి చెందిన లాప్లాటా డాల్ఫిన్. అంతే.. అక్కడున్న వారు దానిని నీటిలోకి వదలాలనే కనీస విషయాన్నే మరచిపోయి దానితో పోటీలు పడి సెల్ఫీలు దిగారు. ఒకరి చేతిలో నుండి ఇంకొకరు తీసుకుంటూ దానిని బయటే ఉంచారు. దీంతో ఆ డాల్ఫిన్ మృతి చెందింది. ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో చూసిన జంతుప్రేమికులు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు.

లాప్లాటా డాల్ఫిన్లు ప్రపంచ వ్యాప్తంగా 30,000 మాత్రమే ఉన్నాయి. ఇవి అర్జెంటీనా, ఉరుగ్వే, బ్రెజిల్ తీరాల్లో మాత్రమే కనిపించే అరుదైన రకానికి చెందినవి. ఇప్పటికే వీటిని అంతరించి పోతున్న జీవుల జాబితాలో అత్యంత ప్రమాదకరమైన దశలో ఉన్నట్లుగా రెడ్ లిస్ట్లో చేర్చారు. అర్జెంటీనా వైల్డ్లైఫ్ ఫౌడేషన్ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి డాల్ఫిన్లు కనిపిస్తే వాటిని వెంటనే నీటిలోకి వదలాలని ఓ ప్రకటనను విడుదల చేసింది.

 

మరిన్ని వార్తలు