మానవత్వం లేదా; తాలిబన్లే బెటర్‌!

26 Jun, 2019 10:43 IST|Sakshi

వలస చిన్నారుల పట్ల కస్టమ్స్‌ అండ్‌ బార్డర్‌ ప్రొటెక్షన్‌ తీరుపై ఆగ్రహం

వాషింగ్టన్‌ : తమ దేశంలోకి చొరబడుతున్న వలసదారుల్ని సరిహద్దుల్లోనే నిలువరించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ‘జీరో టాలరెన్స్‌’  విధానాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ విధానం ప్రకారం అమెరికాలోకి అక్రమంగా చొరబడిన తల్లిదండ్రులతోపాటు ఉన్న పిల్లల్ని వేరుచేసి.. వేర్వేరు కేంద్రాల్లో ఉంచుతారు. ఎలాంటి సంరక్షణా లేకుండా తాత్కాలికంగా తయారుచేసిన కేజ్‌ల్లో ఐదారేళ్ల పసివారిని నిర్బంధిస్తున్నారంటూ అన్ని వర్గాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. అదే విధంగా కస్టమ్స్‌ అండ్‌ బార్డర్‌ ప్రొటెక్షన్‌(సీబీపీ) ఫోర్స్‌ చిన్నారుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వేలాది ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో జీరో టాలరెన్స్‌ విధానంపై పునరాలోచిస్తామని ట్రంప్‌ సర్కారు పేర్కొంది. ఫెసిలిటీ సెంటర్లలో ఉండే పిల్లలకు సురక్షితమైన, శుభ్రమైన వాతావరణం కల్పిస్తున్నామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ అటార్నీ వాదనపై సీనియర్‌ జడ్జిలు ఘాటుగా స్పందించారు. ఒబామా హయాంలో దాఖలైన ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా..‘ టూత్‌బ్రష్‌, సబ్బు, బ్లాంకెట్‌ ఇలాంటి కనీస అవసరాలు తీరకుండానే పిల్లలు ఇబ్బందులు లేకుండా భద్రంగా ఉంటున్నారా’ అని ప్రశ్నలు సంధించారు. చిన్నారుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్జిల వ్యాఖ్యల నేపథ్యంలో జర్నలిస్టులు, సామాజిక వేత్తలు ట్రంప్‌ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

చదవండి : ‘వారి కళ్లల్లో భయం..మానవత్వానికే మచ్చ’

తాలిబన్లే కాస్త మెరుగ్గా అనిపించారు..!
‘చిన్నారుల విషయంలో అమెరికా అనుసరిస్తున్న విధానాలు కిందిస్థాయిలో ఉన్నాయి. 2012లో ఉగ్రవాదులు నన్ను కిడ్నాప్‌ చేసిన సమయంలో ఇనుప కడ్డీలతో నిర్మించిన కేజ్‌లలో బంధించారు. కరెంటు కూడా ఉండేది కాదు. అయితే నా కనీస అవసరాలు తీర్చుకునేందుకు తాలిబన్లు సహకరించేవారు. టూత్‌బ్రష్‌, సబ్బులు ఇచ్చేవారు. రోజూ స్నానం చేసేందుకు అనుమతినిచ్చి.. మెత్తటి పరపులు ఇచ్చేవారు. భోజనం కూడా ఫర్వాలేదు. కానీ అమెరికాలో మాత్రం శరణార్థి చిన్నారుల పట్ల సరిహద్దు భద్రతా బలగాలు కనికరం లేకుండా వ్యవహరిస్తున్నాయి. ఇది నిజంగా దారుణం’ అంటూ సోమాలియాలో తాలిబన్ల చేతిలో అపహరణకు గురైన అమెరికా జర్నలిస్టు మైఖేల్‌ స్కాట్‌ మూరే తమ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు.

ఇక ఇరాన్‌ చట్టాలను ఉల్లంఘించి ఆ దేశంలోకి వచ్చారన్న కారణంగా అక్కడ అరెస్టైన రేజియాన్‌ అనే జర్నలిస్టు.. ‘ నాకు అక్కడ నిర్బంధంలో ఉన్నట్లుగా అనిపించలేదు. కానీ అమెరికాలో చిన్నారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వారిని కేవలం వస్తువులుగా చూస్తూ కనీసం మానవత్వం ప్రదర్శించకుండా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి చర్యలు భవిష్యత్‌ తరాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. కనీస నైతిక విలువలు పాటించండి’ అని ప్రభుత్వ తీరును విమర్శించారు. కాగా జీరో టాలరెన్స్‌ విధానాన్ని అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌తో పాటు లారా బుష్‌ కూడా తప్పుబట్టిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు