‘ఫేస్‌బుక్‌’ ఉద్యోగి ఆత్మహత్య

20 Sep, 2019 19:30 IST|Sakshi

కాలిఫోర్నియా, సిలికాన్‌ వ్యాలీలోని మెన్లోపార్క్‌గా పిలిచే ‘ఫేస్‌బుక్‌’ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి గురువారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఫేస్‌బుక్‌  కార్యాలయం ఆవరణలోని వంద బ్లాక్‌ల జెఫర్సన్‌ డ్రైవ్‌ భవనం నాలుగో అంతస్తు మీది నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెల్సింది.

అయితే మృతుని పేరు, ఏ దేశస్థుడు తదితరా వివరాలను వెల్లడించేందుకు ఫేస్‌బుక్‌ యాజమాన్యం నిరాకరించింది. ఈ సంఘటన జరిగిన వెంటనే సదరు ఉద్యోగి కుటుంబ సభ్యులకు కబురు పంపామని, వారు వచ్చాక వారి అనుమతితో ఉద్యోగికి సంబంధించిన అన్ని వివరాలు అందిస్తామని యాజమాన్య వర్గాలు తెలిపాయి. తమ క్యాంపస్‌లో, తమ ఉద్యోగి ఇలా బలన్మరణానికి పాల్పడడం పట్ల విచారిస్తున్నామని వ్యాఖ్యానించారు. దేశంలో ఆత్మహత్యల నివారణ కోసం ‘లైఫ్‌లైన్‌ నెంబర్‌ 800–273–8255’ ఉన్నప్పటికీ ఇలా జరగడం శోచనీయమని అన్నారు. 

ఇది ఆత్మహత్యే అయి ఉంటుందని, దీనిపై మరే అనుమానాలు లేవని సంఘటన స్థలాన్ని సందర్శించి మతదేహాన్ని స్వాధీనం చేసుకున్న స్థానిక పోలీసులు తెలిపారు. ఫేస్‌బుక్‌ కంపెనీల్లో ప్రపంచవ్యాప్తంగా 39,651 మంది పూర్తిస్థాయి ఉద్యోగులు పనిచేస్తుండగా, కాలిఫోర్నియా ప్రధాన కార్యాలయంలో కూడా వేల మంది ఉద్యోగస్థులు పనిచేస్తున్నారు. 
 

>
మరిన్ని వార్తలు