మార్క్స్‌ దాస్‌కాపిటల్‌లోని ఒక్క పేజీకి మూడున్నర కోట్లు

25 May, 2018 22:09 IST|Sakshi

వివక్ష, అణచివేత, అసమానతల మూలాలను ఆర్థికరంగంతో ముడిపెట్టి దోపిడీ గుట్టువిప్పిన కారల్‌ మార్క్స్‌ ద్విశతాబ్ది జయంతుత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో ఆయన రాసిన దాస్‌ కాపిటల్‌ రాతప్రతి ఒకే ఒక్క పేజీ 5,23, 000 డాలర్లకు వేలంలో అమ్ముడంతో వార్తల్లోకెక్కింది. ఈ నెల 3న బీజింగ్‌లో మార్క్స్‌ రాసిన దాస్‌ కాపిటల్‌లోని ఒక పేజీ రాతప్రతిని వేలం వేయగా మూడున్నర కోట్లకు పైగా ధర పలికింది.

సెప్టెంబర్‌ 1850 నుంచి 1853 ఆగస్టు మధ్య కాలంలో లండన్‌లో దాస్‌ కాపిటల్‌ రాయడం కోసం ఆయన తయారుచేసుకున్న 1,250 పేజీల నోట్సులోనిదే ఈ పేజీ అని భావిస్తున్నారు.  చైనాకి చెందిన ఫెంగ్‌ లుంగ్‌ అనే వ్యాపారవేత్త బీజింగ్‌లో ఏర్పాటు చేసిన ఓ వేలం కార్యక్రమంలో 5,23,000 డాలర్లకు ఈ పేజీ అమ్ముడయ్యింది. 3 లక్షల యువాన్‌లతో ప్రారంభమైన ఈ వేలం ముగిసేసరికి 3.34 మిలియన్‌ యువాన్‌లు అంటే 5,23000 డాలర్లు పలికింది.

ప్రపంచ ప్రసిద్ధి చెందిన కారల్‌ మార్క్స్‌ కమ్యూనిస్ట్‌ మానిఫెస్టో పుస్తక సహ రచయిత, మార్క్స్‌ సహచరుడు ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌ రాత ప్రతిని సైతం వేలం వేసారు. 1862 నవంబర్‌లో ఓ పత్రిక కోసం  ఎంగెల్స్‌ దాన్ని రాసినట్టు వేలం నిర్వాహకులు తెలిపారు. అయితే ఎంగెల్స్‌ రాత ప్రతి 1.67 మిలియన్‌ యువాన్‌లకు అమ్ముడపోయింది.

-సాక్షి నాల్డెజ్ సెంటర్‌

మరిన్ని వార్తలు